
ఐపిఎల్ 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ విజయ పరంపరకి రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్రేక్ వేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (51), వైభవ్ సూర్యవంశీ(43) కీలక పాత్ర పోషించారు. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ ఈ సీజన్‌లో 400 పరుగుల మైలురాయిని చేరుకొని లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన సహచర ఆటగాడు జైస్వాల్ నుంచి వైభవ్ ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు.
ఈ సందర్భంగా జైస్వాల్‌ని ఓ సీనియర్‌గా వైభవ్‌తో కలిసి ఆడటం ఎలా అనిపిస్తుందని ప్రశ్నించారు. సీనియర్ అనడంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన యశస్వి ఆ తర్వాత స్పందించాడు. ‘‘నేను పెద్దవాడిని అని అనుకోవడం లేదు. నేను ఇంకా చాలా చిన్నవాడినే. కాకపోతే నాకంటే వైభవ్ చాలా చిన్నోడు. దీని గురించి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. అవతలి ఎండ్‌లో నిలబడి ఈ కుర్రాడు నిర్భయంగా బంతిని కొట్టే విధానాన్నిచూసి నేను ఎప్పుడూ సంతోషిస్తాను’’ అని జైస్వాల్ అన్నాడు.














