కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా 2004 నుండి అమలు అవుతోంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఉద్యోగులు, కార్మికులకు పెన్షన్ చెల్లించడానికి కాదు. దేశీయ, విదేశీయ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే! నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సుమారు 20 ఏళ్లనుంచి అమలవుతోంది. 2024 -2025 ఆర్థిక సంవత్సరం వరకు 3.72 లక్షల కోట్ల రూపాయలు నేషనల్ పెన్షన్ స్కీం(జాతీయ పెన్షన్ పథకం) మూలనిధిగా ప్రోగైంది. ఉద్యోగులు, ప్రభుత్వాల వాటాల జమతో ఏటా ఈ మూలనిధి పెరుగుతోంది. ఇంత పెద్దఎత్తున అప్పనంగా వచ్చే నిధులను పూర్తిగా కొట్టేయడానికి పెట్టుబడిదారులు కన్నువేశారు. భారతదేశంలో పెన్షన్ వ్యవస్థను ఆధునీకరించడానికి, పారదర్శకంగా మార్చడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేశారు.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ మాత్రమే పెన్షన్ నిధులను నియంత్రిస్తూ ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ చట్టబద్ధంగా 2013 సెప్టెంబర్ 13న పార్లమెంటు ఆమోదించడంతో ఏర్పడింది. కానీ పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లు 2005లోనే రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ, ఆనాటి రాజకీయ కారణాలతో బిల్లు ఆమోదం పొందక చట్ట రూపంలోకి రాలేదు. ప్రభుత్వ ఉద్యోగుల కష్టార్జితమైన సొమ్మును ప్రైవేటు పెట్టుబడిదారులు తరలించుకుపోవడం జాతీయ పెన్షన్ వ్యవస్థలో జరుగుతోంది. పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్లు, ఇతర మార్కెట్ షేర్లతో జూదమాడి లాభనష్టాలను ఉద్యోగుల మీదికి నెట్టివేసే సూత్రాలు ఈ కొత్త పెన్షన్ విధానంలో ఉన్నాయి. ఈ నేపథ్యం లో అంతర్జాతీయ పెట్టుబడి కూటముల ఒత్తిడితో ఇప్పటికే బీమా రంగంలోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశాన్ని కల్పించిన సర్కారు, ఇప్పుడు పెన్షన్ల రంగంలోనూ అదే తరహా సంస్కరణ చేసే దిశగా అడుగులు వేస్తోంది.

బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% నుంచి 100 శాతానికి పెంచే బిల్లును గత సంవత్సరమే పార్లమెంటు ఆమోదించింది. అంతకంటే ముందు 2015లో బీమా చట్టం 1938లో కీలక సవరణలు చేసి, బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49% నుంచి 74 శాతానికి పెంచారు. ఇప్పుడు దేశంలోని పెన్షన్ ఫండ్లలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితి 49% ఉంది. దీన్ని 100 శాతానికి పెంచేందుకుగానూ ఈమేరకు ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్ ఆర్‌డిఎ) చట్టం 2013’లో పలు సవరణలను ప్రతిపాదిస్తున్నారు. రాబోయే పార్లమెంటు వర్షాకాలం లేదా శీతాకాల సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. భారత పౌరులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించేందుకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌సిఎస్)ను భారత ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

ఇదొక స్వచ్ఛంద, దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు పథకం. దీన్ని పిఎఫ్ ఆర్‌డిఎ సంస్థ నియంత్రిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ఒక పెన్షన్ పథకం. కేవలం దీన్ని పర్యవేక్షించడానికి పిఎఫ్ ఆర్‌డిఎ ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగమే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ (ఎన్‌పిఎస్ ట్రస్టు). పిఎఫ్ ఆర్‌డిఎ పరిధి నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌ను వేరు చేయాలనే సవరణ కూడా ప్రతిపాదిత పెన్షన్ బిల్లులో ఉంది. ప్రస్తుతానికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌కు సంబంధించిన అధికారాలు, విధులు, బాధ్యతలకు ‘పిఎఫ్ ఆర్‌డిఎ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్) రెగ్యులేషన్స్ - 2015’లోని నిబంధనలు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఇకపై ప్రత్యేక ఛారిటబుల్ ట్రస్టుగా లేదా కంపెనీల చట్టం ప్రకారం ఎన్‌పిఎస్ ట్రస్ట్ పని చేసేలా సవరణను పెన్షన్ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. భారత పెన్షన్ రంగ నియంత్రణ సంస్థ పిఎఫ్ ఆర్‌డిఎతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసేలా ఎన్‌పిఎస్ ట్రస్టును మార్చాలని సర్కారు యోచిస్తోంది. దాని నిర్వహణ కోసం 15మంది నిపుణులతో కూడిన ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నారు.

ఎన్‌పిఎస్ ట్రస్టుకు సమకూరే నిధుల్లో సింహ భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచే లభిస్తుంటుంది. అందుకే ఎన్‌పిఎస్ ట్రస్టును నియంత్రించే 15 మంది నిపుణుల్లో మెజారిటీ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచే ఉంటారని చెబుతున్నారు. ఈ మార్పులతో 100% నిధులు విదేశీ పెట్టుబడిదారులకు అందుబాటులోనికి రానున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్)లో ప్రభుత్వం కేవలం నిర్ణీత వాటాను మాత్రమే అందిస్తుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత, చందాదారుడికి అంతే పెన్షన్ వస్తుందనే గ్యారంటీని ఇవ్వదు. ఎందుకంటే ఎన్‌పిఎస్‌లోని చందాదారుల డబ్బును స్టాక్ మార్కెట్, బాండ్లలో పెట్టుబడి పెడతారు. ఎన్‌పిఎస్‌లోని చందాదారులు తమ డబ్బును ఏ సంస్థ నిర్వహించాలో స్వయంగా నిర్ణయించుకోవాలి. పిఎఫ్ డబ్బులో ఎంత శాతం షేర్ మార్కెట్‌లో ఉండాలి, ఎంత శాతం సేఫ్ బాండ్లలో ఉండాలి అనేది కూడా చందాదారులే డిసైడ్ చేసుకోవాలి.

చందాదారుల నిర్ణయం తప్పు అయితే, వచ్చే నష్టానికి వారే బాధ్యులుగా పరిగణించనున్నది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2004 జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌సిఎస్)ను సైతం పిఎఫ్ ఆర్‌డిఎ పర్యవేక్షిస్తోంది. పెన్షన్ ఫండ్లలో ప్రజలు దాచుకున్న సొమ్ముకు రక్షణ కల్పిస్తోంది. మోసాలు జరగకుండా చూస్తోంది. అసంఘటిత రంగ కార్మికులతో సహా అందరికీ పదవీవిరమణ తర్వాత స్థిరమైన ఆదాయం అందేలా అటల్ పెన్షన్ యోజన లాంటి కొత్త పథకాలను అమలు చేస్తోంది. పెన్షన్ నిధులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నియమాలు రూపొందించి, చందాదారులకు మంచి లాభాలు వచ్చేలా పిఎఫ్ ఆర్‌డిఎ వ్యూహ రచనలు చేస్తోంది. ఇక నుంచి ఆ పర్యవేక్షణ ఉండదు.

ఉద్యోగులు కష్టపడి కూడబెట్టుకున్న నిధులకు గ్యారెంటీ లేని పరిస్థితి ఏర్పడుతుంది. నూతన జాతీయ పెన్షన్ విధానం పాత పెన్షన్ విధానం వలే వృద్ధాప్య జీవితానికి గ్యారెంటీ ఇవ్వదని, మార్కెట్ ఒడిదుడుకులు ప్రభావితం చేస్తాయని జాతీయ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు నిరంతరం ఆందోళనలు చేస్తున్నారు. ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులకు పెన్షన్‌నిధులపై 100% అనుమతులు వస్తే, పెన్షన్ నిధుల భద్రత గాలిలో దీపం కానున్నది. పెన్షన్ నిధుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంఘటిత పోరాటాలు మరింత క్రియాశీలకంగా సాగాలి.

- కె. వేణుగోపాల్

98665 14577