నేను మాట తప్పితే అమరవీరుల స్తూపం వద్ద స్తంభానికి కట్టేసి కొట్టాలి

అన్ని విషయాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే హామీలు ఇచ్చాను

సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వస్తున్నాం

ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండటమే లక్ష్యం

మా నాన్న కెసిఆర్‌ను తిట్టలేదు.. బిఆర్‌ఎస్ అధ్యక్షుడిని విమర్శించాను

20 ఏళ్లుగా ఇచ్చిన మాట, పట్టిన తోవను విడవలేదు

ప్రజాస్వామ్యంలో పార్టీ ఉండటమే పవర్

ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా.. లేదా.. అన్నది ఆ పార్టీ నడిపే వ్యక్తిని బట్టి ఉంటుంది

టిఆర్‌ఎస్ నాకు రాసిపెట్టి ఉండటం దైవ సంకల్పంగా భావిస్తున్నా

వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం

మేము అధికారంలోకి వచ్చాక తల్లి మాదిరి పాలన చేస్తాం

మీట్ ది ప్రెస్‌లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన పాంచజన్యంలోని ఐదు అంశాలు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో తాను ఇచ్చిన మాట తప్పితే గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద స్తంభానికి కట్టేసి కొట్టాలని అన్నారు. అన్ని విషయాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే హామీలు ఇచ్చానని చెప్పారు. పాంచజన్యంలోని ఐదు అంశాలను అమలు చేయటంపై ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపానని తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో లక్ష కోట్ల రూపాయలను తమ ప్రాధాన్యత అంశాలకు ఖర్చు చేయవచ్చని అన్నారు. చేయాలన్న సంకల్పం ఉంటే చాలు ఇదంతా సాధ్యమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపైన తెలంగాణ రక్షణ సేన మాట్లాడుతుంది, పోరాటం చేస్తుందని చెప్పారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం సర్వోదయ తెలంగాణ కావాలనుకున్నామని, ఇప్పుడు తాము సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండటమే సర్వోదయ తెలంగాణ లక్ష్యం అని వ్యాఖ్యానించారు. ఆధర్మంపై యుద్ధం చేసేందుకు శ్రీకృష్ణుడు మోగించిన యుద్ధబేరియే పాంచజన్యం అని, తాము కూడా అదే స్ఫూర్తితో పాంచజన్యం పేరుతో ఐదు ప్రాధాన్యత అంశాలను తీసుకున్నామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పాంచజన్యం పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టియుడబ్లూజె) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి మోడరేటర్‌గా వ్యవహరించగా టియుడబ్ల్యూజె అధ్యక్ష కార్యదర్శులు విరహత్ అలీ, రాం నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. గత 20 ఏళ్లుగా తనను చూస్తున్నారని ఇచ్చిన మాట, పట్టిన తోవను విడవకుండా ఉన్నానని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తల్లిలా తాను పరిణితి చెందుతానంటే చాలా మంది విమర్శలు చేశారని అన్నారు. కానీ, తల్లి మాదిరి లాలన లేని కారణంగానే ఇప్పుడు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తల్లి మాదిరిగా ఆలోచిస్తే మాత్రమే ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం వస్తుందని తెలిపారు. వెయ్యి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని, తాము అధికారంలోకి వచ్చాక తల్లి మాదిరి పాలన చేస్తామని తెలిపారు.

మా నాన్నకు కాదు..బిఆర్‌ఎస్ అధ్యక్షుడిని విమర్శించాను

తన తండ్రి కెసిఆర్‌తో తనకు ఎలాంటి పంచాయితీ లేదని, ఆయన లేకపోతే జన్మేలేదని కవిత చెప్పారు. ఇటీవల కెసిఆర్‌పై కవిత చేసిన విమర్శలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పష్టంగా సమాధానం ఇచ్చారు. తన తల్లితండ్రులతో తనకు ఎలాంటి సమస్య లేదని..కానీ, రాజకీయ నేతగా కెసిఆర్‌తో మాత్రం తనకు సిద్ధాంతపరమైన విబేధాలు ఉన్నాయని తెలిపారు. రాజకీయపరంగా ఆయన తప్పు చేస్తే కచ్చితంగా విమర్శిస్తానని, తాను తప్పు చేసినా బిఆర్‌ఎస్ నేతలు విమర్శించవచ్చని అన్నారు. రాజకీయ తప్పులపై భవిష్యత్‌లోనూ విమర్శలు చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో చేయాల్సి ఉన్నప్పటికీ కెసిఆర్ అది చేయలేకపోయారన్నారు. కెటిఆర్ లాంటి తెలివైన ఐటి మినిస్టర్ ఉండగా ఎందుకు పేపర్ లీకైందంటూ ప్రశ్నించారు.

పార్టీ పేరు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాం

తెలంగాణ రాష్ట్ర సేన అని ముందు ప్రకటించిన తర్వాత తెలంగాణ రక్షణ సేనగా పేరు మార్చుకోవడంపై కవిత సమాధానం ఇచ్చారు. తమ పార్టీ పేరు విషయంలో చాలా కుట్రలు జరిగాయని, వాటిని గమనించిన తర్వాతే పార్టీ పేరు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించామని అన్నారు. కావాలనే రకరకాల పేర్లను ప్రచారంలోకి తెచ్చామని పేర్కొన్నారు. అయితే తమ పార్టీకి కేంద్రం ఎన్నికల సంఘం టిఆర్‌ఎస్ అనే పేరును కేటాయించడం పట్ల సంతోష వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ తనకు రాసిపెట్టి ఉండటం దైవ సంకల్పంగా భావిస్తున్నానని అన్నారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కాంగ్రెస్, బిజెపి సహా కెటిఆర్ తక్కువ చేసి మాట్లాడటంపై కవిత స్పందించారు. బిజెపి నేతలు ముందు తెలంగాణకు మేలు చేసే పని చేయాలని సూచించారు. ఈ నెల 10న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీని అడిగి పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తేవాలని, తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు తేవాలని చెప్పారు. అది చేయకుండా తనను విమర్శిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు. సామాజిక న్యాయానికి బద్ద విరోధి అయిన బిజెపి, తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలు మాట్లాడే మాటలు పట్టించుకోనని చెప్పారు.

నా వెనుక ఎవరూ లేరు..ఆ అవసరమూ లేదు

బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి తనకు టార్గెట్ కాదని చెప్పారు. తెలంగాణకు ఎవరు విలన్‌గా ఉంటే తనకు వాళ్లే విలన్ అని పేర్కొన్నారు. తాను ఎన్నో కష్టాలు పడ్డానని, తన వ్యక్తిగత అజెండాను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లనని చెప్పారు. వ్యక్తిగతంగా తన కష్టాలు, రాజకీయ కష్టాలు ఉన్నాయని అన్నారు. రాజకీయ కష్టాలను మాత్రమే ప్రజలకు చెబుతానని వివరించారు. తన వెనుక ఎవరు లేరని కవిత మరోసారి తేల్చిచెప్పారు. ఎవరో తన వెనుక ఉండాల్సిన అవసరం లేదని, తన వెనుక తానే ఉన్నానని స్పష్టం చేశారు. నిప్పుల నుంచి నడిచి వచ్చిన తనకు ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తి ఉందని వ్యాఖ్యానించారు. తమ పార్టీ భావసారూప్యం గల పార్టీలతో ఫ్రీ పోల్స్ అలయెన్స్ పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే అందుకు సిద్ధంగా ఉందని కవిత తెలిపారు,. అయితే భావసారూప్యం లేని వారితో మాత్రం పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చిచెప్పారు. పోస్ట్ పోల్ అలయెన్స్ అవసరం ఉంటుందని భావించటం లేదన్నారు. తెలంగాణ ప్రజలకు తమకు పూర్తి స్థాయిలో మెజార్టీ ఇస్తారని భావిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు.

పురుషుల కన్నా గొప్పగా నడుపుతాం

తమ పార్టీని పురుషులు నడిపే పార్టీ కన్నా గొప్పగా నడుపుతామని కవిత చెప్పారు. దేశంలో ఎంతో మంది మహిళలు సమర్థవంతంగా పరిపాలించారని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో పార్టీని నడుపుతామన్నారు. తమ పార్టీలో కచ్చితంగా మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. మహిళ బిల్లు పాసైనా, కాకపోయిన సరే తాము మాత్రం 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని ప్రకటించారు. బిఆర్‌ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసే ముందు కనీసం వివరణ అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటోన్న రోహిత్ రెడ్డికి మాత్రం షోకాజ్ నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు ఏదో ఒక పార్టీలో చేరాలని కోరారు. తెలంగాణ రక్షణ సేన వారికి స్వాగతం పలుకుతుందన్నారు. అంశాలవారీగా పాదయాత్ర చేస్తామని ప్రకటించారు. జర్నలిస్టులు, మైనార్టీలు, బిసిలు.. అన్ని వర్గాల కోసం పోరాటం చేస్తామని చెప్పారు.

కొత్తదనాన్ని ప్రజలు ఆదరిస్తారు

ప్రజల కోసం ముందుకు వస్తున్న తమకు కచ్చితంగా ప్రజల ఆదరణ ఉంటుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. అయితే తన నడవడిక, ఆచరణ చూశాక ప్రజలు తనను నమ్ముతారని తెలుసు అని పేర్కొన్నారు. అయితే గతంలో కొత్తదనాన్ని ఆహ్వానించిన చరిత్ర ఈ నేలకు ఉందని వ్యాఖ్యానించారు. కచ్చితంగా తమను కూడా ప్రజలు ఆదరిస్తారని నమ్మకం ఉందని కవిత అన్నారు.