ప్రభుత్వ ఏర్పాటుకు మరో 12 మంది శాసససభ్యులు అవసరం

కాంగ్రెస్, పిఎంకె, డిఎండికె, వామపక్షాలు మద్దతు ఇచ్చేనా?

అన్నాడిఎంకెతో కలిసి నడిస్తే పటిష్టంగా ప్రభుత్వం

కింగ్ మేకర్ అవుతాడనుకుంటే కింగే అవుతున్న టివికె అధినేత

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టివికె పార్టీకి ప్రభుత ఏర్పాటు ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. 234 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత ఏర్పాటుకు 118 మంది శాసనసభ్యుల బలం అవసరం. టివికె ఇప్పుడు 106 సీట్లను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. అధికార డిఎంకె 74 మంది తర్వాతి స్థానంలో నిలవగా, అన్నాడిఎంకె 54మందిని గెలుచుకుని మూడో స్థానానికి పరిమితమైంది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 12 మంది అవసరం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, పిఎంకె, డిఎండికె, వామపక్షాలు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే విజయ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

డిఎంకె కూటమితో పొత్తు పెట్టుకోవడానికి ముందు ఒక దశలో టివికెతో కూడా కాంగ్రెస్ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. స్థానిక నేతలు కూడా విజయ్‌తో పొత్తుకే మొగ్గు చూపారు. కానీ చివరి క్షణంలో కాంగ్రెస్, డిఎంకె స్టాలిన్‌తో కలిసి నడిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ తమతో కలిసి రావాలని విజయ్ తండ్రి ఎస్‌ఎ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. తాజా ఫలితాలను చూస్తే కాంగ్రెస్ 5, పిఎంకె 5, వామపక్షాలు 4 గెలుచుకున్నాయి. ఇతరులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే బదులు అతి పెద్ద పార్టీ ఉన్న అన్నాడిఎంకెతో కలిసి నడిస్తే భవిష్యత్‌లో ప్రభుత్వం మరింత పటిష్టంగా ఉంటుందని టివికె వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

రెండు చోట్లా విజయ్ విజయం...

టివికె అధినేత విజయ్ తాజా ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా విజయ ఢంకా మోగించారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి బరిలో దిగిన ఆయన రెండు చోట్లా ఘన విజయం సాధించారు. మరోవైపు ఇటీవల వెలువడిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను చూస్తే తమిళనాట కొత్త రాజకీయ శక్తిగా వచ్చిన విజయ్ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత ఏదో ఒక ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వెలువడ్డాయి. డిఎంకె లేదా అన్నాడిఎంకెకు ఆయన మద్దతు తప్పనిసరి అవుతుందని పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా ఆ రెండు పార్టీలను వెనక్కి నెట్టి 100కుపైగా స్థానాలతో ఆయనే తదుపరి ముఖ్యమంత్రి కాబోతున్నారు.