ఖమ్మం: ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న వాళ్ల సంఖ్య పెరిగిపోతుంది. అధిక ఒత్తిడి కారణంగానో.. శారీరక శ్రమ కారణంగానో చిన్న వయస్సులో ఉన్న వాళ్లు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. ఖమ్మంలోనూ ఇలాంటి విషాదకర సన్నివేశం చోటు చేసుకుంది. తోటి టీచర్లకు బ్లాక్ బోర్డుపై ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తుండగా ఓ టీచర్ గుండె ఆగిపోయింది. ఖమ్మంలోని మమతా రోడ్‌లో శ్రీచైతన్య ఒలింపియాడ్ క్యాంపస్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

గారపాటి జయరాజ్ అనే టీచర్.. అక్కడకు హాజరైన టీచర్లకు ఇంగ్లీష్ ట్రైనింగ్ క్లాసులు ఇస్తున్నారు. అలా పాఠాలు చెబుతుండగా.. జయరాజ్ కుప్పకూలిపోయాడు. తోటి టీచర్లు పరుగెత్తుకుని వచ్చి ఏమైందో తెలుసుకునే లోపే నష్టం జరిగిపోయింది. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర ఘటనపై సహచర టీచర్లు సంతాపం వ్యక్తం చేశారు.