మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి వినతిపత్రాలు సమర్పించారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం మంగళవా రం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను రా ష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి వినతిప త్రం అందించారు. ఆయిల్ పామ్ రైతులకు రక్షణ కల్పించాలని, దిగుమతి సుంకాన్ని 44శాతానికి పెంచాలని, తెలంగాణకు తక్షణమే డిఏపి, యూ రియా సరఫరా చేయాలని, పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుపై 25శాతం పరిమితి ఎత్తివేయాలని, మొక్కజొన్న, జొన్నలను కేంద్రం ఎంఎస్‌పిపై కొనుగోలు చేయాలని మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌లు కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసి తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, రైతుల ప్రయోజనాల పరిరక్షణ, దేశీయ వంటనూనెల ఉత్పత్తి పెంపుపై విస్తృతంగా చర్చించారు.

తెలంగాణలో సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫాం సాగు విస్తరణ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ (ఎన్‌ఎంఈఓఓపి) లక్ష్యాలను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి తుమ్మల కేంద్రమంత్రితో వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించగా, 70 వేల మందికిపైగా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఈ విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నామన్నారు. భారత్ ప్రస్తుతం వంటనూనెల అవసరాల్లో దాదాపు 60 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోందని, ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంఈఓఓపి కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థకు, రైతాంగానికి ఎంతో కీలకమని మంత్రి తుమ్మల కేంద్రమంత్రితో పేర్కొన్నారు. అయితే ఇటీవల క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతం నుంచి 16 శాతానికి తగ్గించడం వల్ల దేశీయ ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులకు కనీస గ్యారంటీ ధరను అమలు చేయాలి

పామాయిల్ దిగుమతులు పెరిగి దేశీయ మార్కెట్లో ధరలు పడిపోతున్నాయని, దీనివల్ల ఆయిల్ పామ్ రైతులు ఉత్పత్తి చేస్తున్న ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (ఎఫ్‌ఎఫ్‌బి)లకు గిట్టుబాటు ధర లభించడం లేదని మంత్రి తుమ్మల వివరించారు. దీర్ఘకాలిక పంట అయిన ఆయిల్‌ఫాం సాగుకు రైతులు భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ధరల అనిశ్చితి రైతుల్లో ఆందోళన కలిగిస్తోందని ఆయన తెలిపారు. దిగుమతి సుంకాన్ని తిరిగి 44 శాతానికి పెంచడం ద్వారా దేశీయ ఆయిల్‌ఫాం రైతులకు రక్షణ కల్పించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆత్మనిర్భర్ భారత్, ఎడిబుల్ ఆయిల్ స్వయం సమృద్ధి లక్ష్యాలు కూడా సాధ్యమవుతాయని మంత్రులు కేంద్రమంత్రితో పేర్కొన్నారు. అలాగే, ఆయిల్ పామ్ రైతులకు కనీస గ్యారంటీ ధర (ఎంజిపి) విధానాన్ని అమలు చేసే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలించాలని వారు కోరారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆయిల్‌ఫాం రైతుల భవిష్యత్తు దృష్ట్యా దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించి రైతులకు భరోసా కల్పించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రులు విజ్ఞప్తి చేశారు.

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పలు అంశాలపై వినతి

అదేవిధంగా, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో డిఏపి యూరియా ఎరువుల అవసరం గణనీయంగా పెరిగిందని, కేంద్రం కేటాయించిన కోటాకు, వాస్తవ సరఫరాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వెంటనే పూడ్చి, రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఎరువులు అందించాలని వారు కేంద్రమంత్రిని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఎరువుల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే, పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోళ్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న 25 శాతం పరిమితి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని వారు పేర్కొన్నారు. రైతులు ఉత్పత్తి చేసిన మొత్తం పంటను కనీస మద్దతు ధర కింద కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకొని ఆ పరిమితిని పూర్తిగా తొలగించాలని వారు కోరారు. దీంతో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు దేశ ఆహార భద్రత, దిగుమతుల తగ్గింపుకు కూడా దోహదపడుతుందని వివరించారు.

మొక్కజొన్న, జొన్నలను కొనుగోలు విధానంలో చేర్చి

ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో సుమారు 15 లక్షల టన్నుల మొక్కజొన్న, 3 లక్షల టన్నుల జొన్నల ఉత్పత్తి నమోదైందని, మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే దిగువకు పడిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆర్థిక భారం భరించి మొక్కజొన్న, జొన్నలను కొనుగోలు చేసిందని, ఈ పంటలను కూడా కేంద్ర ప్రభుత్వ కొనుగోలు విధానంలో చేర్చి ఎంఎస్‌పిపై సేకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

యూరియా, డిఎపి ఎరువుల లభ్యతపై కేంద్రం సానుకూలం

అదేవిధంగా రసాయనాలు-, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు తెలంగాణలో ఎరువుల సరఫరా, పోషకాధారిత ఎరువుల సబ్సిడీ (ఎన్‌బిఎస్) విధానంలో మార్పులకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల పలు లేఖలు రాయగా ఈ వినతులపై స్పందించిన కేంద్ర మంత్రి తెలంగాణలో యూరియా, డిఎపి తదితర ఎరువుల లభ్యత, సరఫరాపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని, రాష్ట్ర రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని శాఖ అధికారులను ఆదేశించినట్లు తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించిన అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించడం రైతాంగానికి ప్రయోజనకరంగా మారుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశాలలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌ల వెంట ఎంపిలు రఘువీర్‌రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.