
మన తెలంగాణ/హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యాక్రమానికి ఉద్యోగ సఘాల జెఏసి నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రధాన డిమాండ్లు అయిన సిపిఎస్ రద్దు, పిఆర్‌సిలు, ఇహెచ్‌ఎస్, పెండింగ్ డిఏలతో పాటు పలు డిమాండ్లను భట్టి దృష్టికి మరోసారి తీసుకెళ్లారు.
దీనిపై భట్టి స్పందిస్తూ.. సిపిఎస్ రద్దు విషయంలో ఇటీవల కాలంలో ఆంధ్రప్రధేశ్ రాష్ట్రం అవలంభించిన విధానంలో చేస్తామని తెలిపారు. పిఆర్‌సిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, పెండింగ్ డిఏలను ప్రకటిస్తామని చెప్పారు. ఉద్యోగ సంఘాలు తలపెట్టిన కార్యాక్రమాన్ని విరమించుకోవాలని డిప్యూటీ సిఎం కోరారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతల స్పందిస్తూ తమ డిమాండ్లను ఏవిధంగా పరిష్కరిస్తారో స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు తమ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అసంపూర్తిగా చర్చలు ముగియడంతో ఉద్యోగ సంఘాలు ఈ నెల 10వ తేదీన చేపట్టనున్న ఛలో హైదరాబాద్, భవిష్యత్ కార్యచరణపై మరోసారి సమావేశం కానున్నట్లు జెఏసి నేతలు వెల్లడించారు.













