హైదరాబాద్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి వాడుతున్న భాష బజారు భాషను తలపిస్తోందని హరీష్‌రావు మండిపడ్డారు. బడ్వే, పైల్వాన్.. బట్టలిప్పి కొడతాడు, తిర్రేసి కొడతాడు అని అసెంబ్లీలో మాట్లాడటం చూసి సభ్యసమాజం తలదించుకుంటోందని అన్నారు. అలాంటి గౌరవం లేని సభకు కెసిఆర్ వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ చిల్లర ముఖ్యమంత్రితో చర్చల్లో పాల్గొనాల్సిన అవసరం కెసిఆర్‌కు లేదు అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు అందరం ఏకగ్రీవంగా నిర్ణయించామని వెల్లడించారు. కెసిఆర్ తయారు చేసిన సైనికులం తామున్నామని తెలిపారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు.

ప్రతిపక్ష నాయకుడు, రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కెసిఆర్ భద్రత మీద రేవంత్ రెడ్డికి ఏడుపెందుకు..? అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం ఎపిలో మాజీ ముఖ్యమంత్రులకు భద్రత కల్పించడం లేదా..? అని అడిగారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని సిఎం తమ్ముడు తిరుపతి రెడ్డికి నలుగురు గన్‌మెన్లు పెట్టి, భద్రత కోసం రూ.40 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నావో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, ఎన్‌టిఆర్, చంద్రబాబు లాంటి నేతల పట్ల అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించినప్పుడు.. వాళ్లు సభను బహిష్కరించి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మళ్లీ ముఖ్యమంత్రులుగా సభలోకి అడుగుపెట్టిన చరిత్ర ఉందని తెలిపారు.

కెసిఆర్ పట్ల కూడా కాంగ్రెస్ అలాగే ప్రవర్తిస్తోంది కాబట్టి ప్రజల నుంచే బుద్ధి చెబుతామని అన్నారు. రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కెసిఆర్ చావును కోరుకునే రేవంత్ రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదని విమర్శించారు. ఇందిరాపార్క్ దగ్గర రోజూ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, వీఆర్‌ఏలు, ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారని, వాళ్లకు సమాధానం చెప్పే దమ్ములేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన సమయంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.