మన తెలంగాణ/హైదరాబాద్: మెట్రో రైల్, ఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఉమ్మడి రోజువారీ, నెలవారీ పాస్‌లను వెంటనే ప్రవేశపెట్టాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. బేగంపేట్ మెట్రో రైల్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదివారం హెచ్‌ఎంఆర్‌ఎల్, టీజీఎస్‌ఆర్టీసీ, విద్యుత్ శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్స్ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మెట్రో, ఆర్టీసీ ప్రయాణీకులకు ఉమ్మడి పాస్ జారీ చేయడానికి సాంకేతిక పరంగా సిద్ధంగా ఉన్నామని.. ఏ రోజైనఅమలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్, ఆర్టీసీ అధికారులు సీఎస్‌కు స్పష్టం చేశారు.

ఉమ్మడి చార్జీలను త్వరితగతిన ఖరారు చేసి వెంటనే పాస్‌ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఇప్పటి వరకు మెట్రో మొదటి, రెండో దశల్లో చేపట్టిన వివిధ పనులపై సంజయ్ జాజుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి, జాయింట్ ఎండీ శివేంద్ర ప్రతాప్ వివరించారు. పాతబస్తీలో 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కోసం రోడ్ విస్తరణ పనుల తాజా స్థితిగతులను సీఎస్ అడిగి తెలుసుకున్నారు.

విస్తరణ పనులు వేగవంతం చేయాలనీ, త్వరితగతిన మెట్రో పనులు ప్రారంభం కావాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్స్ ఎండీ కే.అశోక్ రెడ్డి, మెట్రో రైల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ డీవీఎస్ రాజు, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్ మోహన్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, జీఎం(ఫైనాన్స్) సూర్యప్రకాశం ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.