విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘హ్యాక్ టు ది ఫ్యూచర్ 2026’ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. ఐదు రోజుల బూట్‌క్యాంప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 23 విద్యార్థి బృందాలు పాల్గొని సామాజిక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను రూపొందించాయి. ‘ఫ్యూచర్ స్కిల్స్’ పాఠ్యాంశాల ఆధారంగా విద్యార్థులు ఏఐ, రోబోటిక్స్, యాప్ డెవలప్‌మెంట్ సాయంతో నీటి నాణ్యత పర్యవేక్షణ, ఏనుగుల హెచ్చరిక వ్యవస్థ, స్మార్ట్ ఎమర్జెన్సీ బస్ సిస్టమ్, సైబర్ మోసాలపై అవగాహన కల్పించే చాట్‌బాట్ వంటి వినూత్న నమూనాలను ప్రదర్శించారు.

ఆత్మహత్యలను నిరోధించే అలారం ఫ్యాన్ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఐ అక్షరాస్యత, భవిష్యత్ నైపుణ్యాలపై నిపుణులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు చర్చించారు. విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార సామర్థ్యం, సృజనాత్మకత పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ‘ఫ్యూచర్ స్కిల్స్’ పాఠ్యాంశాలను మరింత విస్తరించాలని విద్యా నాయకత్వాన్ని కోరారు.