ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సంఘాల జేఏసీ, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ-బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి, నేరుగా ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారానే నడపాలని జేఏసీ కోరింది.

జేఏసీ నాయకులు వై. శ్రీనివాసరావు, పాలిసెట్టి దామోదరరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ఆర్టీసీ యాజమాన్యానికి వినతిపత్రాలు సమర్పించారు. 10 వేల ఖాళీల భర్తీ, 4 వేల కొత్త బస్సుల కొనుగోలు, పెండింగ్ పీఆర్‌సీ, డీఏ బకాయిల చెల్లింపు, నాలుగు డీఏల ప్రకటన, 12వ పీఆర్‌సీ ఏర్పాటు వంటి డిమాండ్లను ప్రస్తావించారు.

ప్రైవేట్ సంస్థలకు ఈ-బస్సుల నిర్వహణతో పాటు డిపో భూములను అప్పగించడం వల్ల ఆర్టీసీ ప్రైవేటీకరణకు దారితీస్తుందని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. జూన్ 23, 24 తేదీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.