రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో పొరపాటున చేరిన భూముల కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, యాజమాన్య హక్కులు వినియోగించుకోలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న భూ యజమానులకు అండగా నిలిచేందుకు తిరుపతిలో ‘ఆస్తి హక్కుల కేంద్రం’ను ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా బాధితులకు న్యాయపరమైన సలహాలు, అవసరమైన పత్రాల పరిశీలన, సంబంధిత అధికారులకు వినతులు సమర్పించడంలో సహకారం అందించనున్నారు.
ఈ కేంద్రం ప్రారంభోత్సవంలో మాజీ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. 22ఏ చట్టం అసలు ఉద్దేశం ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ తదితర రక్షిత భూముల అక్రమ లావాదేవీలను అడ్డుకోవడమే అయినప్పటికీ, అనేక ప్రైవేటు పట్టా భూములు కూడా పొరపాటున నిషేధిత జాబితాలో చేరడం వల్ల వేలాది మంది భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.
నిర్వాహకుల ప్రకారం, ఈ కేంద్రం ద్వారా భూ యజమానులు తమ సర్వే నంబర్ల స్థితిని తెలుసుకోవడంతో పాటు, తప్పుగా నమోదైన వివరాలను సరిచేయించుకునేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలపై మార్గనిర్దేశం పొందవచ్చు. బాధితుల ఫిర్యాదులను నమోదు చేసి, సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు.
ఆస్తి హక్కులను పరిరక్షించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. భూములకు సంబంధించిన వివాదాలు, రిజిస్ట్రేషన్ సమస్యలు ఎదుర్కొంటున్న వారు కేంద్రాన్ని సంప్రదించి సహాయం పొందాలని సూచించారు.









