ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న సునీల్‌ను విచారణ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు ఆయనకు జూన్ 25 వరకు రిమాండ్ విధించింది. అనంతరం సునీల్‌ను చంచల్‌గూడా జైలుకు తరలించారు.

ఏపీ స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్‌కు సంబంధించిన మద్యం రవాణా టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్‌కు అనుకూలంగా టెండర్ నిబంధనలు మార్చి ప్రభుత్వానికి సుమారు 195 కోట్ల రూపాయల నష్టం కలిగించారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశమున్నట్లు సమాచారం.