భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమాన సర్వీసులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో 6E 6408 తొలి విమానం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్‌ కావడంతో అధికారులు, జీఎంఆర్‌ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.

తొలి విమానంలో వచ్చిన ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందించారు. అనంతరం హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ తదితర నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.

భోగాపురం నుంచి హైదరాబాద్‌, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌కు ఎయిర్‌ఇండియా, స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా, అబుధాబికి ఇండిగో ద్వారా విమాన సదుపాయం కల్పించనున్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రకు విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.