భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూలై 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.
శనివారం మీడియాతో మాట్లాడిన శ్రీభరత్, విమానాశ్రయం ప్రారంభమైన వెంటనే విమాన సర్వీసులు ప్రారంభమవడం సహజ ప్రక్రియ అని అన్నారు. ఈ నేపథ్యంలో Scoot జూలై 8 నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. త్వరలోనే మరిన్ని దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా తమ సేవలను ప్రకటిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
జూలై 8 తర్వాత ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ విమానం ఏ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుందో ముందుగానే నిర్ధారించుకోవాలని ఎంపీ సూచించారు. వివరాలు తెలుసుకోకుండా పాత విమానాశ్రయానికి వస్తే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే స్కూట్ ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులకు సమాచారం అందించినట్లే, ఇతర ఎయిర్‌లైన్స్ కూడా త్వరలోనే సమాచారం అందిస్తాయని తెలిపారు.
ప్రయాణికుల సౌకర్యార్థం భోగాపురం విమానాశ్రయానికి రోడ్డు కనెక్టివిటీ, ప్రజా రవాణా సదుపాయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. బస్సులు, క్యాబ్‌లు, ఆటోరిక్షాలు వంటి రవాణా సౌకర్యాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని శ్రీభరత్ పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా పర్యాటకం, ఐటీ, పరిశ్రమలు మరియు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన అన్నారు












