ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయమూర్తి జస్టిస్ వల్లూరి కామేశ్వరరావుకు కీలక పదవి దక్కనుంది. పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief Justice)గా ఆయన పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం.. పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు పంపింది.

కొలీజియం ప్రతిపాదనల ప్రకారం.. జస్టిస్ కామేశ్వరరావును పట్నా హైకోర్టు సీజేగా నియమించనుండగా, బాంబే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర విఠల్‌రావు ఘుగేను కలకత్తా హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్‌చంద్ర త్రిపాఠిని బాంబే హైకోర్టుకు, పంజాబ్-హరియాణా హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ అశ్వినీకుమార్ మిశ్రాను అదే హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని సిఫారసు చేసింది.

ఈ సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది.

జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు 1965లో ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జన్మించారు. ఆయన స్వగ్రామం రాజోలు మండలం పొన్నమండ. తండ్రి ఉద్యోగ రీత్యా ఢిల్లీలో స్థిరపడటంతో.. కామేశ్వరరావు విద్యాభ్యాసం, న్యాయవాద వృత్తి అక్కడే కొనసాగించారు.

2013లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ కామేశ్వరరావు.. 2015లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా సేవలందించారు.

కోనసీమకు చెందిన తెలుగు వ్యక్తికి మరో కీలక హోదా దక్కనుండటంతో ఆయన స్వస్థలం, జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.