ఆంధ్రప్రదేశ్‌లో ‘పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత విస్తృతంగా అందించడం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఉద్యోగులు, అధికారులు, ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్’, ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఉద్యోగి, అధికారి కృషి చేయాలని సూచించారు.

రోడ్లపై గుంతలను పూర్తిగా తొలగించేందుకు ‘రోడ్ డాక్టర్’ కార్యక్రమాన్ని మిషన్‌ తరహాలో చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని, దాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ‘జీరో పాథ్‌హోల్స్’ లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.

విజయనగరం జిల్లాలో ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడాన్ని సీఎం ప్రస్తావించారు. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపడితే ప్రజలు స్వచ్ఛందంగా వాటిలో భాగస్వాములు అవుతారని అన్నారు. వివిధ అంశాలపై ప్రజలకు వాస్తవాలను అధికారులు వివరించాలని సూచించారు.

మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయులు నిర్వహించిన ‘సెల్ఫ్ రెస్పెక్ట్ ర్యాలీ’ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. మెరిట్ ఆధారంగా తమ ఎంపిక జరిగిందని చాటిచెప్పేందుకు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారని, ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ చేసిన ఆరోపణలను వారు ఖండించారని తెలిపారు.

ఇదిలా ఉండగా, రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. దాని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.