ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన అర్ధాంగి నారా బ్రాహ్మణితో కలిసి హైదరాబాద్‌లోని తమ నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సోమవారం పవిత్రమైన రోజు సందర్భంగా, వేద పండితుల మార్గదర్శకత్వంలో దంపతులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ వారు మహాశివుడికి ప్రార్థనలు చేశారు.

రుద్రాభిషేకం అనంతరం నారా లోకేశ్, నారా బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ఈ పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. అనంతరం మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.