నిర్మల్, జూన్ 6: వేల రూపాయల ఫీజులతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వైపు పరుగులు తీస్తున్న పరిస్థితులకు భిన్నంగా నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం బాబాపూర్ గ్రామం ఆదర్శంగా నిలిచింది. గ్రామస్తులు తమ పిల్లలను కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

గ్రామంలో జరిగిన సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులు గ్రామంలోకి రాకూడదని, ప్రభుత్వ బడులనే బలోపేతం చేయాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే ప్రైవేట్ స్కూల్స్‌కి పిల్లలను పంపితే జరిమానా విధించాలని కూడా తీర్మానంలో పేర్కొన్నారు.

ప్రైవేట్ స్కూల్స్‌పై అపనమ్మకం.. ప్రభుత్వ బడులపై నమ్మకం

ప్రస్తుతం అనేక మంది తల్లిదండ్రులు అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్‌లోనే మంచి విద్య, క్రమశిక్షణ లభిస్తుందని భావనతో ఆర్థిక భారాన్ని కూడా భరిస్తున్నారు.

అయితే బాబాపూర్ గ్రామస్తులు మాత్రం భిన్నంగా ఆలోచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అన్ని వసతులు ఉన్నాయని, నాణ్యమైన విద్య అందుతోందని భావిస్తూ సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు.

గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం

గ్రామ సర్పంచ్ పడిగెల లక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు సుజాత ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వసతులు, మధ్యాహ్న భోజనం, ఆట స్థలాలు, అలాగే ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన వంటి అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

సర్పంచ్ పడిగెల లక్ష్మి మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు పంపితే ఆర్థిక భారం పెరుగుతుందని, ప్రభుత్వ బడుల బలోపేతానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఆదర్శంగా బాబాపూర్ గ్రామం

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్థానిక సమాజం ముందుకు రావచ్చని బాబాపూర్ గ్రామం ఉదాహరణగా నిలుస్తోంది. గ్రామస్తుల ఈ నిర్ణయం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.