విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కాంట్రాక్ట్ కార్మికుడు కే. పైడి రాజు బుధవారం కన్నుమూశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. గంగవరం గ్రామానికి చెందిన పైడి రాజు, "కేబుల్ రాజు"గా స్థానికంగా ఎంతో గుర్తింపు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ప్రమాదం తర్వాత తీవ్ర గాయాలతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా, తన కుమారులకు వీడియో కాల్ చేసి చివరి సందేశం ఇచ్చారు. "అమ్మను జాగ్రత్తగా చూసుకోండి... చదువులు బాగా కొనసాగించండి... తమ్ముడితో కోపంగా ఉండకండి..." అంటూ చెప్పిన మాటలు కుటుంబ సభ్యులను, గ్రామస్తులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

ఈ విషాద ఘటనతో గంగవరం గ్రామం శోకసంద్రంగా మారింది. జనసేన నేత, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. పైడి రాజు చివరి మాటలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి.

vizag raju.webp