ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అవకాశాల ప్రభావంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్ మార్కెట్ నుంచి భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. శామ్‌సంగ్, టీఎస్‌ఎంసీ, ఎస్‌కే హైనిక్స్ వంటి ఏఐ చిప్ కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో పెట్టుబడులు అమెరికా, తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్ల వైపు మళ్లుతున్నాయి.

ఎలారా సెక్యూరిటీస్ గ్లోబల్ లిక్విడిటీ ట్రాకర్ నివేదిక ప్రకారం, గత రెండు వారాల్లోనే భారత్ నుంచి సుమారు రూ.14 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లాయి. మరోవైపు అమెరికా మార్కెట్లలో ఒక్క వారంలోనే 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రవేశించాయి.

ఏఐ ఆధారిత కంపెనీలకు భారీ డిమాండ్ పెరగడంతో దక్షిణ కొరియా, తైవాన్, జపాన్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో లాభాలు నమోదు చేస్తున్నాయి. తగినంత ఏఐ స్టాక్స్ లేకపోవడంతో భారత్, చైనా మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.