బాలీవుడ్ స్టార్ అలియా భట్ తన చురుకైన సమాధానాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ కామెడీ షో ‘ఇండియాస్ గాట్ లాటెంట్ 2’లో పాల్గొనడంపై అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సరదా స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన రాబోయే చిత్రం ‘ఆల్ఫా’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అలియా భట్, నటి శర్వరి జైపూర్‌లోని ఓ యూనివర్సిటీలో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి సమయ్ రైనా షోలో పాల్గొన్న అనుభవం గురించి అలియాను ప్రశ్నించారు.
అయితే, ప్రేక్షకుల్లో ఉన్న ఓ వ్యక్తి సరదాగా స్పందిస్తూ.. ఆమె ఆ షోకు వెళ్లడానికి కారణం డబ్బులేనని వ్యాఖ్యానించారు. దీనికి అలియా భట్ నవ్వుతూ “ఎవరు చెప్పారు?” అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ఆమె స్పందనకు అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.
అలియా భట్, శర్వరి కలిసి ‘ఇండియాస్ గాట్ లాటెంట్ 2’ తొలి ఎపిసోడ్‌లో తమ చిత్రం ‘ఆల్ఫా’ ప్రమోషన్‌లో భాగంగా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌లోని పలు వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
అనుకోని ప్రశ్నలను కూడా ఆత్మవిశ్వాసంతో, హాస్యభరితంగా ఎదుర్కొనే అలియా శైలిని అభిమానులు ఎప్పటి నుంచో ప్రశంసిస్తున్నారు. తాజా ఘటనలో కూడా ఆమె తన చమత్కారంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇదిలా ఉండగా, అలియా భట్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రం ‘ఆల్ఫా’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కొనసాగిస్తోంది.












