మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
1978లో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన చిరంజీవి.. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్‌గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తన సినీ ప్రస్థానంతో పాటు రక్తనిధి, నేత్రనిధి వంటి సేవా కార్యక్రమాల ద్వారా మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. సమాజం పట్ల తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని పలువురు ప్రముఖులు కొనియాడారు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరోవైపు థియేటర్లలో చిరంజీవి క్లాసిక్ హిట్ చిత్రాలను ప్రదర్శిస్తూ మెగా సెలబ్రేషన్స్‌ను పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిరంజీవి తదుపరి చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీంతో మెగాస్టార్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికలన్నీ మెగాస్టార్ నామస్మరణతో మార్మోగుతున్నాయి.









