న్యూయార్క్‌లో ఇండీ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ (IFFA)–2026 నిర్వహించనున్నారు. సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన దర్శకులు, నటులు, కథాకర్తలు, సాంకేతిక నిపుణులను సత్కరించే ఈ అంతర్జాతీయ వేడుక ఆగస్టు 4 నుంచి 6 వరకు న్యూయార్క్‌లోని క్వాడ్ సినిమాలో జరగనుంది.

ఈ ఏడాది 20కి పైగా దేశాల నుంచి 135కు పైగా చిత్రాలు ప్రదర్శనకు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 4 సాయంత్రం 6 గంటలకు ప్రారంభోత్సవం జరుగనుండగా, భారత కాన్సుల్ జనరల్ బినయ్ ప్రధాన్, భారత కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే, సొసైటీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ టెలివిజన్ ఇంజినీర్స్ చైర్మన్ ఉజ్వల్ నిర్గుడ్కర్, ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అభయ్ సిన్హా తదితర ప్రముఖులు పాల్గొననున్నారు.

ఆగస్టు 6న జరిగే గ్రాండ్ అవార్డ్స్ కార్యక్రమంలో 25కు పైగా ప్రతిష్ఠాత్మక అవార్డులు ప్రదానం చేయనున్నారు. హాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు అవార్డులను అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రెడ్ కార్పెట్ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ ప్రముఖుల సందడి ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి