ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’ ట్రైలర్ విడుదలైంది. ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ కథ ఇప్పుడు మరింత భారీ స్థాయిలో వెండితెరపైకి రానున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది.
ట్రైలర్‌లో కాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా భయ్యా మరోసారి అధికార గద్దె కోసం పోరాడుతున్నట్లు చూపించారు. రక్తపాతం, ప్రతీకారం, అధికారం కోసం జరిగే యుద్ధం ఈసారి మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతుందని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది.
ప్రత్యేకంగా మున్నా భయ్యా తిరిగి కనిపించడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆయన రీఎంట్రీపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, సినిమాకు ఇదే ప్రధాన ఆకర్షణ అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించగా, కథను పునీత్ కృష్ణ రూపొందించారు. వెబ్ సిరీస్‌కు ఉన్న క్రైమ్, యాక్షన్, రాజకీయ కుట్రల వాతావరణాన్ని కొనసాగిస్తూనే, థియేటర్లలో ప్రేక్షకులకు మరింత గ్రాండ్ అనుభూతిని అందించేలా సినిమాను రూపొందించినట్లు ట్రైలర్‌లో కనిపిస్తోంది.
పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రవి కిషన్, శ్వేతా త్రిపాఠి, రసికా దుగల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.









