దక్షిణాది సినిమాలతో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన రష్మికా మందన్నా మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసిపోయారు. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026లో పాల్గొని అభిమానులను ఆకట్టుకున్నారు. గత రెండేళ్లుగా ఈ వేడుకలో అవార్డు ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్న రష్మిక, ఈసారి కూడా తన స్టైల్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన నల్లటి సీక్విన్డ్ గౌనులో ఆమె రాయల్ లుక్‌తో కనిపించారు. పూల అలంకరణలతో కూడిన స్ట్రాప్‌లెస్ డిజైన్ గౌను, మెరిసే ఆభరణాలు, స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో ఆమె అందరినీ మంత్రముగ్ధులను చేశారు.
గ్రాండ్ ప్రిన్స్ హోటల్ షిన్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో, ‘బ్లాక్ పాంథర్’ నటుడు విన్‌స్టన్ డ్యూక్ తో కలిసి ‘బెస్ట్ యానిమేషన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందించారు. వేదికపై వీరిద్దరి సరదా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
యానిమే సంస్కృతిపై తన అభిమానాన్ని ఇప్పటికే వెల్లడించిన రష్మిక, భారత్-జపాన్ సాంస్కృతిక బంధానికి ప్రతీకగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినీ ప్రతిభను చాటుతున్న ఆమె ప్రయాణం యువతకు స్ఫూర్తిగా మారుతోంది.












