అమెరికాలో తెలుగు భాషా వైభవం మరోసారి వెలుగొందింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల 13వ వార్షికోత్సవం (వసంతోత్సవం) అత్యంత వైభవంగా జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తెలుగు సంస్కృతి అభిమానులతో కలిసి దాదాపు 500 మందికి పైగా అతిథులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సుమారు ఆరు గంటలపాటు సాగిన ఈ వేడుకలు ఆద్యంతం అలరించాయి. చిన్నారుల ప్రతిభ, తెలుగు సంప్రదాయాల సోయగం, సాంస్కృతిక ప్రదర్శనల సందడి ఒకే వేదికపై కనువిందు చేశాయి. పిల్లలు ప్రదర్శించిన “గుణపాఠం”, “పరమానందయ్యగారి శిష్యులు”, “శివసంకల్పం” నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ఆలపించిన శ్లోకాలు, పద్యాలు, గేయాలు సభలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణాన్ని నింపాయి.

కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గ్రాడ్యుయేషన్ వాక్. వివిధ కేంద్రాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు వేదికపై ఘనంగా నడుచుకుంటూ వచ్చి సర్టిఫికెట్లు అందుకోవడం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. తెలుగు భాషను విదేశాల్లోనూ ప్రేమతో నేర్చుకుంటున్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విశాఖపట్నం ఎంపీ శ్రీ ఎం. భరత్, ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి శ్రీ జయరాం కోమటి హాజరై పాఠశాల బృందాన్ని అభినందించారు. ప్రవాస తెలుగు చిన్నారులు ప్రదర్శించిన అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విదేశీ నేలపై తెలుగు భాష, సంస్కృతిని ఈ స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న నిర్వాహకులను ప్రశంసించారు.