మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ మాల్వా జిల్లా, నల్ఖేడా సమీపంలోని కాళిసింధ్ నది తీరంలో ఉన్న గడియా ఘాట్ మాతా దేవాలయం తన అద్భుత విశ్వాసాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా దీపం వెలిగించడానికి నూనె లేదా నెయ్యి ఉపయోగిస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం కేవలం నది నీటితోనే దీపం వెలుగుతుందనే నమ్మకం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

స్థానిక కథనం ప్రకారం, పూర్వకాలంలో అమ్మవారు ఆలయ పూజారికి స్వప్నంలో దర్శనమిచ్చి, కాళిసింధ్ నది నీటితో దీపం వెలిగించమని ఆదేశించారట. ఆ ఆదేశం ప్రకారం పూజారి నీటిని దీపంలో పోసి అగ్గిపుల్ల వెలిగించగానే దీపం వెలిగినట్లు చెబుతారు. ఈ అద్భుతాన్ని గ్రామస్థులు కూడా పరీక్షించి నిజమని నమ్మిన తర్వాత, అప్పటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

వర్షాకాలంలో కాళిసింధ్ నది ఉప్పొంగడంతో ఆలయం కొంతమేర మునిగిపోతుంది. ఆ సమయంలో పూజలు నిలిచిపోతాయి. శరదృతువులో నవరాత్రుల సందర్భంగా మళ్లీ ఘటస్థాపనతో పాటు దీపారాధన ప్రారంభమవుతుంది.

భక్తులు ఇప్పటికీ ఈ అద్భుత దీపాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు.