శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, వసతి కల్పిస్తామంటూ నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా లింకులు, అనధికార దళారుల ద్వారా భక్తులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. భక్తులు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని కోరింది.

టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి, దర్శనం, సేవలు, వసతి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వెబ్‌సైట్లకు టీటీడీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, నకిలీ వెబ్‌సైట్లను తొలగించే చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు.

భక్తులు దర్శనం, సేవా టికెట్లు, వసతి బుకింగ్‌లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్ ద్వారానే చేసుకోవాలని సూచించారు. వీఐపీ దర్శనం, ప్రత్యేక టికెట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు అడిగే వ్యక్తులను, సోషల్ మీడియాలో వచ్చే అనధికార లింకులను నమ్మవద్దని హెచ్చరించారు.

భక్తులను మోసం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. అనుమానాస్పద వెబ్‌సైట్లు, దళారులు లేదా మోసపూరిత కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే టీటీడీ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.