నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌కు గ్లోబల్ టచ్ వచ్చింది. ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ‘ఏష నాగుల’ను అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్‌లో ప్రత్యేకంగా విడుదల చేశారు.

అనిరుధ్ తన లైవ్ కాన్సర్ట్‌లో పాటను ఆవిష్కరించగా.. నాని ఊహించని విధంగా స్టేజ్‌పైకి వచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఇద్దరూ కలిసి చేసిన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో డల్లాస్ ఆడిటోరియం సందడిగా మారింది.

సాధారణంగా డిజిటల్‌గా పాటను విడుదల చేయడానికి భిన్నంగా.. మేకర్స్ వేలాది మంది అభిమానుల సమక్షంలో లైవ్ స్టేజ్‌పై రెండో సింగిల్‌ను పరిచయం చేశారు. అనంతరం ఈ పాట డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది.

మరోసారి నాని-అనిరుధ్ కాంబో

‘ఏష నాగుల’తో నాని, అనిరుధ్ మరోసారి కలిసి పనిచేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే.

ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. ప్రభా, జంగి రెడ్డి పాటకు గాత్రం అందించారు.

ఫోక్, మాస్ ఎనర్జీతో రూపొందిన ఈ పాటలో నాని తన ‘జడల్’ పాత్రకు సంబంధించిన రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. లిరికల్ వీడియోలో కీర్తి సురేష్ కూడా కనిపించడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

‘ఆయా షేర్’ ఇప్పటికే భారీ హిట్

‘ఏష నాగుల’కు ముందు విడుదలైన ‘ది ప్యారడైజ్’ తొలి సింగిల్ ‘ఆయా షేర్’ ఇప్పటికే భారీ స్పందన అందుకుంది.

మేకర్స్ ప్రకారం ఈ పాట యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్ దాటడంతో పాటు 1.8 మిలియన్లకు పైగా లైక్స్ సాధించింది. నాని లుక్, హుక్ స్టెప్ సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.

సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ విడుదల

‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’లో నాని జడల్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో రాఘవ్ జుయల్, కయాదు లోహర్, మోహన్ బాబు, సోనాలీ కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్, స్పానిష్, బెంగాలీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

డల్లాస్‌లో ‘ఏష నాగుల’ లాంచ్‌కు వచ్చిన భారీ స్పందనతో ‘ది ప్యారడైజ్’పై అంచనాలు మరింత పెరిగాయి. మూవీ విడుదలకు ఇంకా కొద్ది వారాలే ఉండటంతో ప్రమోషన్స్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.