సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ బృందాలు హైదరాబాద్‌లోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో విజయవాడ స్పెషల్ కృష్ణా కేఫే మరియు పాలమూరు గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్లో పలు పరిశుభ్రత, ఆహార భద్రతా లోపాలు వెలుగుచూశాయి.
అధికారుల తనిఖీల్లో వంటగది పరిసరాల్లో ఈగలు అధికంగా ఉండటం, చెత్త బుట్టలను సకాలంలో ఖాళీ చేయకపోవడం, ఆహారం తయారుచేసే ప్రాంతాల్లో దుమ్ము పేరుకుపోవడం, ఫ్రిజ్‌లలో మూతలు లేదా లేబుళ్లు లేకుండా పిండిపదార్థాలు, చట్నీలు, కూరగాయలను నిల్వ చేయడం వంటి లోపాలు గుర్తించారు. అలాగే కడిగే ప్రదేశాల వద్ద నీరు నిల్వ ఉండటం, తుప్పుపట్టిన కత్తులను వినియోగించడం కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
పాలమూరు గ్రిల్‌లో వంటగదిలో ఈగలు, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన ఫ్రీజర్లు, వేడి నీటితో పాత్రలు శుభ్రం చేయకపోవడం, ఆహార పదార్థాల లేబులింగ్‌లో లోపాలు వంటి అంశాలను అధికారులు గుర్తించారు. సిబ్బందికి సంబంధించిన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా అందుబాటులో లేవని వెల్లడించారు.
ఈ లోపాలపై సంబంధిత హోటళ్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసిన అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి తనిఖీలు నగరవ్యాప్తంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.








