ట్రంప్ ప్రభుత్వ కొత్త గ్రీన్‌కార్డ్ విధానంపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులు తమ స్వదేశాలకు వెళ్లి అక్కడి నుంచే అప్లై చేయాలన్న నిర్ణయాన్ని అమెరికా చట్టసభ సభ్యులు, ఇమ్మిగ్రేషన్ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నిర్ణయం వల్ల చట్టబద్ధంగా సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ పన్నులు చెల్లిస్తున్న లక్షలాది భారతీయులు అనిశ్చితిలో పడిపోయారని విమర్శిస్తున్నారు.
మాజీ వైట్‌హౌస్ సలహాదారు అజయ్ భుటోరియా మాట్లాడుతూ, “ఈ నిర్ణయం 12 లక్షల భారతీయ అమెరికన్లు, వారి కుటుంబాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది” అన్నారు. ఇదే సమయంలో, ఏ వర్గాలకు మినహాయింపులు ఉంటాయన్నదానిపై అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ స్పష్టత ఇవ్వలేదు.











