మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చిన్న కుమార్తె ఫీబీ గేట్స్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె సహ-వ్యవస్థాపకురాలిగా ప్రారంభించిన 'ఫియా (Phia)' స్టార్టప్‌పై 'కుకీ స్టఫింగ్ (Cookie Stuffing)' ఆరోపణలు రావడంతో అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలు నిజమని తేలితే సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది.

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో తనతో కలిసి చదివిన సోఫియా కియానితో కలిసి ఫీబీ గేట్స్ ‘ఫియా’ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇది ఏఐ ఆధారిత డిజిటల్ పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను సూచించడం, వివిధ ఆన్‌లైన్ స్టోర్లలో డిస్కౌంట్ కోడ్‌లను వెతికి ఇవ్వడం దీని ప్రధాన సేవలు. ఈ సేవ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ రూపంలో పనిచేస్తుంది.

సాధారణంగా వినియోగదారు ఫియా ద్వారా కూపన్ కోడ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే, సాఫ్ట్‌వేర్ ఒక ట్రాకింగ్ కుకీని జతచేస్తుంది. దాని ఆధారంగా ఆ కొనుగోలులో ఫియా పాత్ర ఉందని గుర్తించిన రిటైలర్ సంస్థకు కమిషన్ చెల్లిస్తుంది. అయితే, వినియోగదారుడు ఫియా సేవలను ఉపయోగించకపోయినా లేదా కూపన్ కోడ్ ఎంచుకోకపోయినా ట్రాకింగ్ కుకీలు జతచేసి కమిషన్ పొందుతున్నారనే ఆరోపణలే ప్రస్తుతం వివాదానికి కారణమయ్యాయి. ఈ ప్రక్రియనే 'కుకీ స్టఫింగ్'గా పిలుస్తారు.

అమెరికాలో ఇలాంటి చర్యలు ఫెడరల్ వైర్ ఫ్రాడ్ (Federal Wire Fraud) చట్ట పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఇవి ఆరోపణలు మాత్రమే. సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టిన తర్వాతే వాస్తవాలు తేలనున్నాయి. ఆరోపణలు కోర్టులో రుజువైతే చట్టప్రకారం కఠిన శిక్షలు, గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.