కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సోమవారం సంభవించిన ప్రకంపనల ధాటికి డజన్ల కొద్దీ పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు సుమారు 1,600 భవనాలు నేలమట్టమైనట్లు అధికారులు గుర్తించారు. నాలుగు ప్రాంతాల్లో 179 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. మరోవైపు సుమారు 3 వేల మంది గల్లంతైనట్లు సమాచారం. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
మంగళవారం సహాయక చర్యలను అధికారులు మరింత ముమ్మరం చేశారు. శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడుతున్న వారిని సహాయక బృందాలు ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాలి, పెరీరా, చారో, మనిజాలెజ్ ప్రాంతాల మేయర్లు, గవర్నర్లు ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు.
భూకంప కేంద్రంగా ఉన్న చాకో ప్రాంతంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. అక్కడికి చేరుకోవాలంటే కొన్ని ప్రాంతాలకు పడవల ద్వారా మాత్రమే వెళ్లాల్సి వస్తోంది. కొలంబియాలో అత్యంత వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో చాకో ఒకటిగా అధికారులు పేర్కొంటున్నారు. దీంతో సహాయక బృందాలు బాధితులను చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.









