ఇటలీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో జరిగిన ద్వైపాక్షిక చర్చలు విజయవంతమయ్యాయని మోదీ తెలిపారు. 2029 నాటికి ఇటలీ కంపెనీలు భారత్‌లో 20 బిలియన్ యూరోల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. AI, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. IMEC కారిడార్ అమలుపై కూడా భారత్-ఇటలీ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశాయి.
భారత్‌లో ప్రస్తుతం 800 ఇటలీ కంపెనీలు పనిచేస్తున్నాయని మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడిందన్నారు. యోగాకు ఇటలీలో విశేష ఆదరణ ఉందని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారం, భారత్-యూరోపియన్ యూనియన్ సంబంధాల బలోపేతంపై కూడా ఇరు దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై స్పందించిన ప్రధాని మోదీ.. ప్రతి సమస్యకు చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని అన్నారు. టెర్రర్ ఫండింగ్ ప్రపంచ శాంతికి ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటలీ ప్రధాని మెలోని ప్రధాని మోదీకి రోమ్‌లో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు డిన్నర్ సమావేశంలో పాల్గొన్నారు. చారిత్రక కొలోసియంను కలిసి సందర్శించిన మెలోని.. రోమ్ చరిత్రను మోదీకి వివరించారు. ఈ సందర్భంగా మోదీతో సెల్ఫీ దిగిన మెలోని.. “వెల్‌కమ్ టు రోమ్ మై ఫ్రెండ్” అంటూ ట్వీట్ చేశారు.















