రష్యా అధ్యక్షుడు Vladimir Putin భారత్‌కు అత్యాధునిక సు-57 ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని ఆఫర్ చేస్తూ, దాని సంయుక్త తయారీకి కూడా సిద్ధమని ప్రకటించారు. దీంతో భారత్-రష్యా రక్షణ సహకారం మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది.

అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ పుతిన్, సు-57 ప్రాజెక్టులో భారత్‌తో ఎలాంటి పరిమితులు లేకుండా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలో ఈ విమానాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయాలని భారత్‌కు ప్రతిపాదించినట్లు ఆయన గుర్తుచేశారు.

భారత్ ప్రస్తుతం స్వదేశీ అడ్వాన్స్‌డ్ మల్టీరోల్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నప్పటికీ, అది 2035 తర్వాతే సేవల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా కనీసం రెండు స్క్వాడ్రన్ల సు-57 యుద్ధ విమానాల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. Hindustan Aeronautics Limited ఇప్పటికే రష్యా సుఖోయ్ డిజైన్ బ్యూరోతో చర్చలు జరుపుతోంది.

అలాగే ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థతో పాటు ఇతర వైమానిక రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో కూడా భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమని పుతిన్ తెలిపారు. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ ప్రతినిధి Randhir Jaiswal, భారత్-రష్యా రక్షణ సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.