అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాల్‌రూమ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈసారి న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్‌లో ఉన్న తన ప్రైవేట్ గోల్ఫ్ క్లబ్‌లో 11 వేల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో బాల్‌రూమ్ నిర్మించనున్నారు. ఇది క్లబ్‌హౌస్ విస్తరణ ప్రాజెక్టులో భాగంగా ఉంటుంది.
ప్రస్తుతం సుమారు 26 వేల చదరపు అడుగులుగా ఉన్న క్లబ్‌హౌస్‌ను 54 వేల చదరపు అడుగులకు విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. అంటే భవనం పరిమాణం రెట్టింపుకంటే ఎక్కువ కానుంది. అలాగే సీటింగ్ సామర్థ్యం కూడా గణనీయంగా పెరగనుంది. దీంతో సుమారు 550 మంది క్లబ్ సభ్యులు, వారి కుటుంబాల కోసం వివాహాలు వంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలు కలగనుంది.
ఈ విస్తరణలో కొత్త బాల్‌రూమ్‌తో పాటు అదనపు పార్కింగ్ స్థలం, ప్రైవేట్ మురుగునీటి శుద్ధి వ్యవస్థను విస్తరించడం, వర్షపు నీటి నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన స్థానిక, రాష్ట్ర స్థాయి అనుమతుల కోసం ట్రంప్ బృందం ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇందుకు కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.
అయితే ఈ ప్రాజెక్టుపై కొందరు స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాల్‌రూమ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై బెడ్‌మినిస్టర్ ల్యాండ్ యూజ్ బోర్డు ముందు ట్రంప్ బృందం ప్రతిపాదనలు, అనుమతుల కోసం దరఖాస్తు చేసింది.
ఇదిలా ఉండగా, ట్రంప్ వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో 90 వేల చదరపు అడుగుల భారీ బాల్‌రూమ్ నిర్మాణాన్ని కూడా చేపడుతున్నారు. ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అనుమతి, చారిత్రక కట్టడాల పరిరక్షణకు సంబంధించిన అంశాలతో న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి.
ట్రంప్ బెడ్‌మినిస్టర్ గోల్ఫ్ క్లబ్‌లో ఇప్పటికే గోల్ఫ్ కోర్సులు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. కొత్త బాల్‌రూమ్ అందుబాటులోకి వస్తే క్లబ్‌లో పెద్ద స్థాయి ప్రైవేట్ కార్యక్రమాలకు మరో ప్రధాన వేదికగా మారనుంది.








