అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో గురువారం కాల్పుల ఘటన కలకలం రేపింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల సమయంలో వెస్ట్ 44వ స్ట్రీట్, సెవెన్త్ అవెన్యూ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయుధాలు బయటకు తీసి కాల్పులు జరిపినట్లు కనిపించింది. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడు 18 ఏళ్లలోపు వయస్సు కలవాడని వెల్లడించారు. ఘటనాస్థలంలో ఒక తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా, కాల్పులు యాదృచ్ఛికమా లేక లక్ష్యంగా చేసుకుని జరిపారా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. మరికొందరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.