ఉమ్మడి విశాఖ జిల్లా దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్గా వేగంగా ఎదుగుతోంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో మరో మూడు డేటా సెంటర్ల ఏర్పాటుకు దాదాపు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి.

డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా సంస్థ రూ.58,743 కోట్ల పెట్టుబడితో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేసి 1,250 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతిపాదించింది. అలాగే రిన్యూ (ReNew) సంస్థ అనకాపల్లి జిల్లాలో గ్రీన్ డేటా సెంటర్ కోసం రూ.85,200 కోట్ల పెట్టుబడి పెట్టి 1,000 మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. మరోవైపు ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ సంస్థ రూ.31,387 కోట్లతో ఏఐ ఆధారిత డేటా మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ఏర్పాటు చేసి మరో 1,000 ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ప్రతిపాదించింది.

అదనంగా అక్షిత్ గ్రీన్‌టెక్ సంస్థ పరవాడలో 3.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ సెల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం రూ.1,600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 725 మందికి ఉపాధి లభించనుంది. ప్రతిపాదిత ప్రాజెక్టులకు అనువైన భూములను గుర్తించే బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించారు.

ఇప్పటికే విశాఖలో పలు భారీ డేటా సెంటర్ ప్రాజెక్టులు ప్రకటించబడిన నేపథ్యంలో, తాజా ప్రతిపాదనలతో ఈ ప్రాంతం ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, హైపర్‌స్కేల్ డేటా సెంటర్లకు కీలక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి