అమెరికా-కెనడా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. సెప్టెంబర్ 8 నుంచి అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు.

ఇటీవల అమెరికా సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడా వస్తువులపై 50 శాతం సుంకాలు విధించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విఫలమైన తర్వాత అమెరికా ఈ చర్య తీసుకుంది.

దీనికి ప్రతిస్పందనగా కెనడా కూడా ‘డాలర్‌కు డాలర్’ విధానంలో సుంకాలు విధిస్తుందని కార్నీ స్పష్టం చేశారు. అమెరికా చర్యల ప్రభావం నుంచి కెనడా కార్మికులు, రైతులు, కుటుంబాలు, వ్యాపారాలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఏ వస్తువులపై సుంకాలు?

కెనడా విధించనున్న ప్రతీకార సుంకాల పరిధిలో స్టీల్, పాల ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలు, పల్ప్, పేపర్ తదితర అమెరికా ఉత్పత్తులు ఉండే అవకాశం ఉంది.

విఫలమైన వాణిజ్య చర్చలు

వాషింగ్టన్, ఒట్టావా మధ్య జరిగిన వాణిజ్య చర్చలు చివరకు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అమెరికా డిమాండ్లను అన్యాయంగా, కెనడా ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేలా ఉన్నాయని కార్నీ అభిప్రాయపడ్డారు.

చర్చలు విఫలమైన తర్వాత అమెరికా కొత్త సుంకాలను అమల్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అమెరికా తిరిగి చర్చలు ప్రారంభించే ఉద్దేశంలో లేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ పేర్కొన్నట్లు సమాచారం.

వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం

అమెరికా, కెనడా దశాబ్దాలుగా కీలక వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. అయితే తాజా సుంకాల నిర్ణయాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

అమెరికా మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కెనడా ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. సుంకాల ప్రభావం ఎదుర్కొనే కెనడా పరిశ్రమలకు మరిన్ని సహాయక చర్యలను త్వరలో ప్రకటించనున్నట్లు కార్నీ తెలిపారు.