దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇప్పుడు మైలేజీపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆటో నిపుణుల ప్రకారం, పెట్రోల్‌ మరియు డీజిల్‌ కార్లకు గంటకు 80 నుంచి 95 కిలోమీటర్ల వేగం ఉత్తమం. ఈ వేగంలో ఇంజిన్‌పై ఒత్తిడి తక్కువగా ఉండటంతో పాటు గాలి నిరోధకత కూడా తగ్గి ఇంధన వినియోగం నియంత్రణలో ఉంటుంది.

అయితే వేగం 110 కిలోమీటర్లకు మించిన తర్వాత ఇంధన ఖర్చు వేగంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 95 కిలోమీటర్ల వేగంతో పోలిస్తే 110 వద్ద దాదాపు 9 శాతం ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. 130 కిలోమీటర్ల వేగంలో అది 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

తక్కువ గేర్‌లో ఎక్కువసేపు డ్రైవ్‌ చేయడం కూడా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైవేపై క్రూయిజ్‌ కంట్రోల్‌ ఉపయోగించడం ఇంధన ఆదాకు దోహదపడుతుంది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు గంటకు 65 నుంచి 80 కిలోమీటర్ల వేగం ఉత్తమమని సూచిస్తున్నారు.