ప్యాకేజ్డ్ ఫుడ్ కొనుగోలు చేసే వినియోగదారులకు ఇకపై ఉత్పత్తిలో చక్కెర, ఉప్పు, కొవ్వు ఎంత ఉందో సులభంగా తెలిసే అవకాశం ఉంది. అధిక మోతాదులో చక్కెర, సంతృప్త కొవ్వు లేదా ఉప్పు ఉన్న ఆహార ఉత్పత్తులపై ప్యాకెట్ ముందు భాగంలో ఎరుపు రంగు హెచ్చరిక లేబుల్ ఏర్పాటు చేయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రతిపాదించింది.

ఈ మేరకు రెడ్ కలర్ షట్కోణాకార (Hexagonal) వార్నింగ్ సింబల్ను ఉపయోగించాలని ప్రతిపాదించింది. ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ఫ్రంట్-ఆఫ్-ప్యాక్ న్యూట్రిషన్ లేబులింగ్‌కు సంబంధించిన కేసులో భాగంగా ఈ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ముందు ఉంచింది.

ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై మరింత స్పష్టమైన హెచ్చరిక లేబుల్స్ తీసుకురావడంలో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు ఇటీవల ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో FSSAI తాజా ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.

రెడ్ లేబుల్‌పై ఏముంటుంది?

కొత్త విధానం అమల్లోకి వస్తే ప్యాకెట్ ముందు భాగంలో అవసరాన్ని బట్టి “HIGH FAT”, “HIGH SUGAR”, “HIGH SALT” వంటి స్పష్టమైన హెచ్చరికలు కనిపించనున్నాయి.

అధికంగా తీపి కలిగిన కొన్ని పానీయాలకు ప్రత్యేకంగా “HIGHLY SWEETENED BEVERAGE” అనే హెచ్చరికను కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

వినియోగదారులు ప్యాకెట్ వెనుక ఉన్న చిన్న అక్షరాల్లోని పోషక వివరాలను చదవకుండానే ఉత్పత్తి ఆరోగ్యపరంగా ఏ స్థాయిలో ఉందో ఒక చూపులో అర్థం చేసుకునేలా ఈ లేబుల్స్‌ను రూపొందించాలని FSSAI భావిస్తోంది.

రెండు దశల్లో అమలు

ఈ ఫ్రంట్-ఆఫ్-ప్యాక్ వార్నింగ్ విధానాన్ని రెండు దశల్లో అమలు చేయాలని FSSAI ప్రతిపాదించింది.

మొదటి దశలో, నిర్దేశిత పరిమితి కంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు — సంతృప్త కొవ్వు, అదనపు చక్కెర లేదా ఉప్పు — అధికంగా ఉన్న ఉత్పత్తులపై రెడ్ వార్నింగ్ లేబుల్ ఉంటుంది.

రెండో దశలో, వీటిలో ఏ ఒక్క పోషక పదార్థం కూడా నిర్దేశిత పరిమితిని మించినా హెచ్చరిక లేబుల్ వర్తించేలా విధానాన్ని విస్తరించాలని ప్రతిపాదించారు. ఈ పరిమితులు ICMR-NIN రూపొందించిన Dietary Guidelines for Indians, 2024 ఆధారంగా నిర్ణయించనున్నారు.

నూనె, ఉప్పు, చక్కెర, బెల్లం, తేనె వంటి కొన్ని ప్రాథమిక సింగిల్-ఇంగ్రిడియెంట్ ఉత్పత్తులకు ఈ వార్నింగ్ లేబుల్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు.

ఎందుకు ఈ నిర్ణయం?

వినియోగదారులకు సులభంగా, స్పష్టంగా, వెంటనే అర్థమయ్యే సమాచారాన్ని అందించడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమని FSSAI చెబుతోంది. ముఖ్యంగా పిల్లలు, ఇతర సున్నిత వర్గాల ప్రజలు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు చేసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని నియంత్రణ సంస్థ పేర్కొంది.

దేశంలో ఊబకాయం, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్యాకేజ్డ్ ఫుడ్‌పై స్పష్టమైన హెచ్చరికలు అవసరమని ఆరోగ్య కార్యకర్తలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.

ఫుడ్ కంపెనీల నుంచి అభ్యంతరాలు

అయితే ప్యాకేజ్డ్ ఫుడ్, పానీయాల పరిశ్రమలోని కొన్ని వర్గాలు ఇలాంటి హెచ్చరిక లేబుల్స్‌పై గతంలో అభ్యంతరం వ్యక్తం చేశాయి. రెడ్ వార్నింగ్ సింబల్స్ వినియోగదారులను గందరగోళానికి గురిచేయవచ్చని, అవి తప్పనిసరిగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దారితీయవని పరిశ్రమ ప్రతినిధులు వాదించారు.

మరోవైపు, ఆరోగ్య కార్యకర్తలు మాత్రం ప్యాకేజ్డ్ ఫుడ్‌లోని అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు వంటి అంశాలను వినియోగదారులు ఒక చూపులో గుర్తించేలా స్పష్టమైన లేబులింగ్ అవసరమని చెబుతున్నారు.

సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో FSSAI తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే, భారత్‌లో ప్యాకేజ్డ్ ఫుడ్ లేబులింగ్ విధానంలో ఇది కీలక మార్పుగా నిలిచే అవకాశం ఉంది.