అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తున్న అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్పై ఇరాన్ IRGC పలు దాడులకు పాల్పడింది.

అయితే అమెరికా నేవీ నౌకలు క్షిపణి దాడులను విజయవంతంగా తప్పించుకున్నాయని CENTCOM తెలిపింది. ఈ ఘటనలో అమెరికా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది.

మూడు ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడి

IRGC దాడులకు ప్రతిస్పందనగా అమెరికా బలగాలు మూడు ఇరాన్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నాయని CENTCOM తెలిపింది.

వాటిలో రెండు ట్యాంకర్లను శాశ్వతంగా నిర్వీర్యం చేసినట్లు, మరో ట్యాంకర్‌ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది.

లక్ష్యంగా చేసుకున్న నౌకలు:

  • M/T Downy — ఖార్గ్ ఐలాండ్ సమీపంలో దాడి.

  • M/T Stark 1 — జాస్క్ సమీపంలో దాడి.

  • M/T Kylo (Noxen) — గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లో ఉన్న ఖాళీ ట్యాంకర్‌పై దాడి.

IRGC నిధులకు ట్యాంకర్లు ఉపయోగపడుతున్నాయని అమెరికా ఆరోపణ

ఈ మూడు ట్యాంకర్లు ఇరాన్ IRGC, దాని ప్రాంతీయ మిత్ర మిలిటెంట్ గ్రూపులకు నిధులు అందించే బహుళ బిలియన్ డాలర్ల షాడో నెట్‌వర్క్‌లో భాగమని అమెరికా సైన్యం ఆరోపించింది.

CENTCOM కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్.. అమెరికా బలగాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇరాన్ ఆయిల్ ఫ్లీట్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.

ఖార్గ్ ఐలాండ్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి

మరోవైపు ఖార్గ్ ఐలాండ్ సమీపంలో ఇరాన్‌కు చెందిన ఒక ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దాడి చేసిందని ఇరాన్ మీడియా వెల్లడించింది.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, సిబ్బందిని నౌక నుంచి తరలిస్తున్నట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి. అయితే అమెరికా, ఇరాన్ వర్గాల ప్రకటనల్లో వ్యత్యాసాలు ఉన్నాయి.

ఖార్గ్ ఐలాండ్ ఎందుకు కీలకం?

ఇరాన్ చమురు ఎగుమతులకు ఖార్గ్ ఐలాండ్ అత్యంత కీలకమైన ప్రాంతం. అందుకే ప్రస్తుత అమెరికా-ఇరాన్ ఘర్షణలో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి నెలకొంది.

తాజా దాడులు పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, హార్ముజ్ జలసంధి మీదుగా జరిగే వాణిజ్య రవాణాపై ఆందోళనలను పెంచుతున్నాయి. హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి.

అమెరికా-ఇరాన్ ఘర్షణ మరింత ముదిరే అవకాశం

అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవలి రోజుల్లో వరుసగా దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకుంటున్నాయి. కొంతకాలం కొనసాగిన సాపేక్ష ప్రశాంతత తర్వాత మరోసారి సైనిక ఉద్రిక్తతలు పెరిగాయి.

ఇప్పుడు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరగడంతో ఈ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ షిప్పింగ్, చమురు సరఫరాలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.