ఒకప్పుడు హోటల్ బుక్ చేయడం అంటే ధర ఎంత? లొకేషన్ ఎక్కడ? రూమ్ ఫొటోలు ఎలా ఉన్నాయి? అనే మూడు విషయాలు చూసి నిర్ణయం తీసుకోవడమే.

కానీ ఇప్పుడు ట్రావెలర్ల అంచనాలు మారుతున్నాయి.

ఆకర్షణీయమైన ఫొటోలు, తక్కువ ధర ఉన్నంత మాత్రాన హోటల్ మంచి ఎంపిక అవుతుందని చెప్పలేం. రూమ్ పరిశుభ్రంగా ఉందా? భద్రత ఎలా ఉంది? వై-ఫై సరిగ్గా పనిచేస్తుందా? సిబ్బంది స్పందన ఎలా ఉంటుంది? బుక్ చేసిన తర్వాత ప్లాన్ మారితే డబ్బులు తిరిగి వస్తాయా? వంటి అంశాలు కూడా నిర్ణయంలో కీలకంగా మారుతున్నాయి.

స్టార్ రేటింగ్ కంటే రివ్యూలు ముఖ్యం

హోటల్ ఎంపికలో ట్రావెలర్లు మొదటగా చూసే అంశాల్లో గెస్ట్ రివ్యూలు ఒకటి.

హోటల్‌కు 4.5 లేదా 5 స్టార్ రేటింగ్ ఉందని మాత్రమే చూసి బుక్ చేయడం కంటే.. ఇటీవల అక్కడ బస చేసిన వారు ఏం చెబుతున్నారో తెలుసుకోవడం మరింత ఉపయోగకరం.

రూమ్ పరిశుభ్రత, బాత్రూమ్ పరిస్థితి, హౌస్‌కీపింగ్, సిబ్బంది ప్రవర్తన, శబ్దం, ఆన్‌లైన్‌లో చూపించిన ఫొటోలకు నిజమైన రూమ్‌కు ఉన్న తేడా వంటి విషయాలను రివ్యూల ద్వారా తెలుసుకోవచ్చు.

18 అంతర్జాతీయ మార్కెట్లలో YouGov నిర్వహించిన పరిశోధనలో 57 శాతం మంది హోటల్ బుక్ చేసే ముందు ఇతర ట్రావెలర్ల రివ్యూలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

భారత్‌లోనూ హోటల్ బుక్ చేసే ముందు రివ్యూలు, టెస్టిమోనియల్స్ కీలక అంశాలుగా ఉన్నాయని KPMG India CX Report సూచిస్తోంది.

పరిశుభ్రత విషయంలో రాజీ ఉండదు

మంచి లొకేషన్, అందమైన ఇంటీరియర్ ఉన్నా హోటల్ పరిశుభ్రంగా లేకపోతే మొత్తం అనుభవం దెబ్బతింటుంది.

అందుకే ట్రావెలర్లు బెడ్ షీట్లు, బాత్రూమ్, హౌస్‌కీపింగ్, రూమ్ మొత్తం పరిశుభ్రత గురించి తాజా రివ్యూలను పరిశీలిస్తున్నారు.

ఆన్‌లైన్‌లోని ఫొటోలు పాతవి కావచ్చు. కానీ ఇటీవల బస చేసిన అతిథుల అనుభవం హోటల్ ప్రస్తుత పరిస్థితిపై మరింత స్పష్టమైన అవగాహన ఇవ్వగలదు.

ఇప్పుడు వై-ఫై కూడా అవసరమే

ప్రయాణాల్లో వై-ఫై ఇక అదనపు సదుపాయం మాత్రమే కాదు.

వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియో కాల్స్, స్ట్రీమింగ్, ఆన్‌లైన్ మ్యాప్స్ లేదా కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి ప్రయాణికులకు స్థిరమైన ఇంటర్నెట్ అవసరం కావచ్చు.

హోటల్ “ఫ్రీ వై-ఫై” ఉందని పేర్కొన్నంత మాత్రాన సరిపోదు. రూమ్‌లో సిగ్నల్ ఎలా ఉంది? స్పీడ్ ఎంత? మొత్తం ప్రాపర్టీలో అందుబాటులో ఉందా? అదనపు ఛార్జీలు ఉన్నాయా? వంటి విషయాలను కూడా కొందరు ట్రావెలర్లు పరిశీలిస్తున్నారు.

భద్రత, ప్రైవసీ కూడా కీలకమే

హోటల్ బుక్ చేసేటప్పుడు భద్రత కూడా ముఖ్యమైన అంశంగా మారింది.

సెక్యూర్ ఎంట్రన్స్, రిసెప్షన్ అందుబాటులో ఉండటం, రూమ్ యాక్సెస్, సీసీటీవీ, సెక్యూరిటీ సిబ్బంది, పరిసర ప్రాంత భద్రత వంటి విషయాలను ముఖ్యంగా సోలో ట్రావెలర్లు, కుటుంబాలు పరిశీలించవచ్చు.

ప్రీమియం హోటళ్ల విషయంలో ప్రైవసీ, ఎక్స్‌క్లూజివిటీ, సెక్యూరిటీ ఫీచర్లు ముఖ్యమైన అంశాలని KPMG పరిశోధన పేర్కొంది.

రూమ్ ధరలో ఏమేం ఉన్నాయి?

ఒకే ధరకు రెండు హోటల్ రూమ్‌లు కనిపించినా వాటి విలువ ఒకేలా ఉండకపోవచ్చు.

ఒక హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్, పార్కింగ్, ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌ఫర్ లేదా ఫ్లెక్సిబుల్ క్యాన్సిలేషన్ ఉండవచ్చు. మరో హోటల్‌లో వీటికి అదనంగా డబ్బు చెల్లించాల్సి రావచ్చు.

అందుకే కేవలం రూమ్ ధరను కాకుండా మొత్తం చెల్లించాల్సిన మొత్తం, అందులో ఉన్న సదుపాయాలను పరిశీలించడం ముఖ్యం.

కొంచెం ఎక్కువ ధర ఉన్న రూమ్ కూడా అదనపు సదుపాయాలు కలిపి చూస్తే వాస్తవానికి చౌకగా మారొచ్చు.

క్యాన్సిలేషన్ పాలసీ చూడటం మర్చిపోవద్దు

ప్రయాణ ప్రణాళికలు ఎప్పుడైనా మారవచ్చు.

అందుకే క్యాన్సిలేషన్ డెడ్‌లైన్, రీఫండ్ పాలసీ, తేదీ మార్చడానికి ఛార్జీలు, నో-షో పాలసీ వంటి వివరాలను బుకింగ్‌కు ముందే తెలుసుకోవాలి.

ముఖ్యంగా నాన్-రిఫండబుల్ రూమ్‌లను బుక్ చేసేటప్పుడు ఈ నిబంధనలను జాగ్రత్తగా చదవడం అవసరం.

హోటల్ సర్వీస్ ఎలా ఉంది?

బుకింగ్ పూర్తయిన తర్వాతే అసలు అనుభవం మొదలవుతుంది.

చెక్-ఇన్ ఎంత సులభంగా జరిగింది? సిబ్బంది స్పందన ఎలా ఉంది? హౌస్‌కీపింగ్ సమయానికి వస్తుందా? సమస్య వచ్చినప్పుడు హోటల్ ఎంత త్వరగా పరిష్కరిస్తుంది? వంటి అంశాలు మొత్తం అనుభవాన్ని నిర్ణయిస్తాయి.

KPMG పరిశోధనలో చెక్-ఇన్ అనుభవం, ప్రొఫెషనల్ మరియు సానుభూతితో వ్యవహరించే సిబ్బంది, రూమ్ క్వాలిటీ, సదుపాయాలు, హౌస్‌కీపింగ్ వంటి అంశాలు కీలకంగా ఉన్నట్లు వెల్లడైంది.

బడ్జెట్ హోటళ్లలో కూడా మంచి సర్వీస్ ఒక ముఖ్యమైన ప్రత్యేకతగా మారుతోంది. మెరుగైన సేవ అందించే హోటల్ కోసం కొంత ఎక్కువ చెల్లించేందుకు కొందరు వినియోగదారులు సిద్ధంగా ఉన్నట్లు KPMG తెలిపింది.

ఫుడ్, బ్రేక్‌ఫాస్ట్, ఇతర సదుపాయాలు

హోటల్‌లోని రోజువారీ సదుపాయాలు కూడా నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి.

బ్రేక్‌ఫాస్ట్, పార్కింగ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, రెస్టారెంట్, రూమ్ సర్వీస్, పిల్లల కోసం సదుపాయాలు వంటి అంశాలు ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారికి ఉపయోగపడవచ్చు.

అయితే హోటల్‌లో ఏం ఉందనే దానికంటే.. మీ ప్రయాణానికి ఏది నిజంగా అవసరం అనేది ముఖ్యం.

ఇప్పుడు హోటల్ అంటే కేవలం నిద్రించడానికి స్థలం కాదు

ట్రావెల్ అనుభవంలో హోటల్ పాత్ర కూడా మారుతోంది.

మంచి కమ్యూనికేషన్, ఇచ్చిన హామీలను నెరవేర్చడం, సమస్యలకు త్వరగా స్పందించడం, సౌకర్యవంతమైన వాతావరణం వంటి అంశాలు హోటల్‌కు ఎక్కువ ధరను సమర్థించేలా చేయవచ్చు.

అందుకే హోటల్ బుక్ చేసేటప్పుడు స్క్రీన్‌పై కనిపించే తక్కువ ధరను మాత్రమే చూడకుండా.. ఆ ధరకు నిజంగా ఏమి లభిస్తోంది? అని ప్రశ్నించాలి.

చివరగా “Book” బటన్ నొక్కే ముందు ఒక ప్రశ్న వేసుకోవడం మంచిది:

“నేను అక్కడికి వెళ్లిన తర్వాత ఈ హోటల్ నా అంచనాలకు తగ్గ అనుభవాన్ని ఇస్తుందా?”