భారత సైన్యం యాంటీ-ఆర్మర్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక అడుగు వేసింది. అమెరికా నుంచి జావెలిన్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసైల్ సిస్టమ్స్ కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.

₹292 కోట్ల ప్రభుత్వ-ప్రభుత్వ డీల్ అత్యవసర కొనుగోలు విధానంలో భాగంగా జరిగింది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో సుమారు 60 జావెలిన్ క్షిపణులు, వాటికి సంబంధించిన లాంచ్ సిస్టమ్స్, ఇతర పరికరాలు ఉన్నాయి.

ఆపరేషన్ సిందూర్ తర్వాత సైనిక సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడానికి కేంద్రం కల్పించిన అత్యవసర కొనుగోలు అధికారాల కింద ఈ కొనుగోలు చేపట్టారు.

జావెలిన్ మిసైల్ ప్రత్యేకత ఏమిటి?

FGM-148 జావెలిన్ అమెరికాలో తయారైన భుజంపై మోసుకుని ప్రయోగించగల మీడియం-రేంజ్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసైల్.

ప్రధానంగా ట్యాంకులు, ఇతర సాయుధ వాహనాలను లక్ష్యంగా చేసుకునేందుకు దీనిని రూపొందించారు. బంకర్లు, రక్షణాత్మక నిర్మాణాలపై కూడా దీనిని ఉపయోగించవచ్చు.

ఇది ‘ఫైర్ అండ్ ఫర్గెట్’ విధానంలో పనిచేస్తుంది. అంటే ఆపరేటర్ క్షిపణిని ప్రయోగించిన తర్వాత లక్ష్యాన్ని నిరంతరం గైడ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు లేదా స్థానాన్ని మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

జావెలిన్ వ్యవస్థను RTX, లాక్‌హీడ్ మార్టిన్ భాగస్వామ్యంతో ఏర్పడిన Javelin Joint Venture తయారు చేస్తోంది. అమెరికా సైన్యంతో పాటు పలు దేశాలు దీనిని వినియోగిస్తున్నాయి.

ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక కొనుగోలు

ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత సైన్యం తన యుద్ధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవడానికి జావెలిన్ వ్యవస్థ కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.

అత్యవసర కొనుగోలు విధానం ద్వారా సైన్యానికి తక్షణ అవసరమైన ఆయుధాలు, పరికరాలను నిర్దిష్ట ఆర్థిక పరిమితిలో వేగంగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ జావెలిన్ కొనుగోలు కూడా అదే విధానంలో జరిగింది.

డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్నప్పటికీ.. పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా వెల్లడించలేదు.

భారత్-అమెరికా రక్షణ బంధానికి మరింత బలం

ఈ ఒప్పందం కేవలం క్షిపణుల కొనుగోలుకే పరిమితం కాదు.

ఈ డీల్ ద్వారా భారత్, అమెరికా రక్షణ రంగాల మధ్య సహ ఉత్పత్తి (Co-production) అవకాశాలపై చర్చలకు మార్గం ఏర్పడుతుందని అమెరికా మిషన్ తెలిపింది.

భారత్‌లో రక్షణ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇరు దేశాల పరిశ్రమల మధ్య మరిన్ని అవకాశాలు ఏర్పడవచ్చని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు.

ఇది భారత్-అమెరికా మధ్య ఇప్పటికే కొనసాగుతున్న విస్తృత రక్షణ, వ్యూహాత్మక సహకారానికి మరో ముందడుగుగా భావిస్తున్నారు.

స్వదేశీ యాంటీ-ట్యాంక్ క్షిపణిపైనా భారత్ దృష్టి

అమెరికా నుంచి జావెలిన్ కొనుగోలు చేస్తున్నప్పటికీ.. భారత్ స్వదేశీ మ్యాన్-పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసైల్ అభివృద్ధిపైనా దృష్టి కొనసాగిస్తోంది.

దీర్ఘకాలంలో విదేశీ ఆయుధాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని పెంచడం ఈ స్వదేశీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు.

అందువల్ల తాజా జావెలిన్ ఒప్పందం ఒకవైపు భారత సైన్యానికి తక్షణ యాంటీ-ఆర్మర్ సామర్థ్యాన్ని పెంచుతుండగా.. మరోవైపు భారత్-అమెరికా రక్షణ పరిశ్రమల మధ్య భవిష్యత్ సహకారానికి కూడా కొత్త అవకాశాలను తెరుస్తోంది.