కోట్లాది మంది భక్తులు ఎదురుచూసిన పవిత్ర అమర్‌నాథ్ యాత్ర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగనుంది.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ యాత్రికులకు రాసిన ప్రత్యేక లేఖలో ఐదు ప్రధాన ప్రతిజ్ఞలు చేయాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత పాటించడం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడడం, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, అధికారులు జారీ చేసే భద్రతా, ట్రాఫిక్ మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించడం, వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.

రక్షాబంధన్ సందర్భంగా ఒక రాఖీతో పాటు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలని కూడా సూచించారు. అమర్‌నాథ్ యాత్ర భారత ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ పవిత్ర యాత్ర విజయవంతంగా సాగాలని ఉప రాష్ట్రపతి ఆకాంక్షించారు.