ఝార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పరీక్షలపై తీవ్ర వివాదం నెలకొన్న వేళ.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఉద్యోగార్థులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో.. జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అంతేకాదు.. 2014 నుంచి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన అన్ని ఉద్యోగ నియామక పరీక్షలు, వాటి ఫలితాలను కూడా రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.
సీఎం సోరెన్ అధ్యక్షతన జరిగిన సుదీర్ఘ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి అమితాబ్ కౌశల్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
నియామక పరీక్షల అవకతవకలపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు. జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్ష రద్దు చేయాలని సాగుతున్న ఆందోళన సోమవారంతో 24వ రోజుకు చేరుకుంది. మరోవైపు.. ఆరుగురు నిరసనకారులు ఇంకా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.









