తమిళనాడు ప్రజా రవాణా వ్యవస్థలో కొత్తగా 300 బస్సులు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ డీజిల్‌, సీఎన్‌జీ బస్సులను ముఖ్యమంత్రి విజయ్‌ చెన్నై సచివాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

రాష్ట్ర రవాణా సంస్థల ఆధునీకరణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ప్రజా రవాణాను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కొత్త బస్సులను ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ బస్సులను సుదూర సర్వీసులు నిర్వహించే స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (SETC) మినహా మిగిలిన ఏడు ప్రభుత్వ రవాణా విభాగాలకు కేటాయించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బస్సు సేవలు మరింత విస్తరించనున్నాయి.

బస్సుల ప్రారంభ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి విజయ్‌ స్వయంగా కొత్త బస్సులో ప్రయాణించి సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిపారు.