న్యూఢిల్లీ దక్షిణ ప్రాంతంలోని సాకేత్ ప్రాంతంలో శనివారం సాయంత్రం బహుళ అంతస్తుల భవనం కూలిపోవడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలోని సైదులాజాబ్‌లో ఉన్న ఈ వాణిజ్య భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
భవనం గ్రౌండ్ ఫ్లోర్‌పై కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉండగా, పై అంతస్తుల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా మూడో అంతస్తు నిర్మాణంలో ఉండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కూలిన భవనం పక్కనే ఉన్న టిన్‌షెడ్ క్యాంటీన్‌పై కూడా శిథిలాలు పడటంతో అక్కడ భోజనం చేస్తున్న కొందరు చిన్నారులు చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, డీడీఎంఏ, మున్సిపల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 7:44 గంటలకు భవనం కూలినట్లు ఫైర్ సర్వీసెస్‌కు సమాచారం అందింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఘటనపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, భవనం నిర్మాణ నాణ్యత సరిగా లేకపోవడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కార్యాలయ సమయాల్లో ఈ ఘటన జరిగి ఉంటే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.













