నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, ఆకస్మిక వరదలతో అనేక ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వేలాది మంది గల్లంతయ్యారు. ఈ విషాదం మధ్య కొందరు ప్రాణాలతో బయటపడిన వారి కథలు మాత్రం ఆశను కలిగిస్తున్నాయి.
అలాంటి అద్భుత ప్రాణరక్షణ ఘటనల్లో ఒకటి 97 ఏళ్ల గునా మాయా బోహరాది. వరదల ధాటికి ఆమె ఉంటున్న కేర్ హోమ్ కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుపోయారు. అధికారులు, రెస్క్యూ సిబ్బంది సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెను సజీవంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆమె మేనల్లుడి కుమారుడు దీపక్ బోహరా.. శిథిలాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెను చూసి “యుద్ధంలో గెలిచి వచ్చిన యోధురాలిలా కనిపించింది” అని చెప్పాడు.
కళ్ల ముందే కొట్టుకుపోయిన ఇళ్లు
చైనా సరిహద్దుకు సమీపంలోని నేపాల్ ప్రాంతాల్లో వరదలు ఒక్కసారిగా విరుచుకుపడటంతో ప్రజలకు తప్పించుకునేందుకు పెద్దగా సమయం లేకుండా పోయింది.
టిమురే ప్రాంతంలో కస్టమ్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్న రాజు బుధాతోకి.. భూమి ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లుగా కంపించిందని తెలిపారు.
వెంటనే ఇంటి నుంచి బయటకు పరుగెత్తిన ఆయన సుమారు 500 మీటర్లు ఎత్తులో ఉన్న అడవిలోకి చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.
కొండపై నుంచి చూస్తుండగానే ఇళ్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడాన్ని ఆయన కళ్లారా చూశారు. ఈ అనుభవాన్ని తన జీవితానికి దక్కిన “రెండో అవకాశం”గా ఆయన అభివర్ణించారు.
ఆర్మీ అందించిన నూడుల్స్‌తో రాత్రంతా బతికారు
మరో కస్టమ్స్ ఏజెంట్ ప్రకాశ్ గౌతమ్ కూడా భారీ శబ్దం వినిపించడంతో వెంటనే అడవివైపు పరుగులు తీశారు.
రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకోలేకపోవడంతో గౌతమ్‌తో పాటు మరికొందరు బాధితులు అడవిలోనే రాత్రంతా గడిపారు.
ఆ సమయంలో నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ నుంచి కిందకు జారవిడిచిన నూడుల్స్ ప్యాకెట్లతో వారు ఆకలి తీర్చుకున్నారు.
మరుసటి రోజు ఉదయం సుమారు 10 గంటలకు ఆర్మీ హెలికాప్టర్ వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. హెలికాప్టర్ ఎక్కిన తర్వాతే తాను నిజంగా ప్రాణాలతో బయటపడ్డానని గౌతమ్ భావించానని తెలిపారు.
వరద వేగానికి కొట్టుకుపోయిన మరికొందరు
వరదల నుంచి బయటపడిన మరికొందరు బాధితులు తమకు ఎదురైన భయానక అనుభవాలను వివరించారు.
తులసీ బహదూర్ భండారీను భారీ మట్టి, నీటి ప్రవాహం కొట్టుకుపోయి కొండ వైపున పడేసింది. అదే ఆయన ప్రాణాలను కాపాడింది. ప్రవాహం తనను కొండ వైపు నెట్టకపోయి ఉంటే తాను బతికేవాడిని కాదని ఆయన తెలిపారు.
మరోవైపు 21 ఏళ్ల సుజల్ థాపా కూడా వరద ప్రవాహంలో తన ఇంటి నుంచి పలుమీటర్లు దూరం కొట్టుకుపోయారు. కాలు, తల, వేళ్లకు గాయాలైన ఆయనను భద్రతా సిబ్బంది గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఇల్లు పూర్తిగా కొట్టుకుపోగా, తల్లి ఆచూకీ ఇంకా తెలియలేదు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
భారీ విధ్వంసం మధ్య రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.
శనివారం నాటికి నేపాల్, టిబెట్ కలిపి మృతుల సంఖ్య 676కు చేరగా, దాదాపు 3,000 మంది గల్లంతైనట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. నేపాల్‌లోనే 3,700 మందికి పైగా బాధితులను రక్షించినట్లు అధికారులు తెలిపారు.
దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, కొండ ప్రాంతాలు, మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం కారణంగా సహాయక చర్యలు తీవ్ర సవాళ్ల మధ్య కొనసాగుతున్నాయి.
తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వేలాది కుటుంబాలు ఎదురుచూస్తున్న వేళ.. శిథిలాల నుంచి, అడవుల నుంచి, వరద ప్రవాహాల నుంచి ఒక్కొక్కరిని సజీవంగా బయటకు తీసుకురావడం వారికి ఆశాకిరణంగా మారుతోంది.












